స్థాయీ సంఘాలతో  చట్టసభలకు కొత్త సామర్ధ్యం

                                                                                                                             - డి.వి.వి.యస్‌. వర్మ



ఆంధ్రప్రదేశ్‌లో చట్టసభలకు స్థాయీసంఘాలు రాబోతున్నాయి. శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ , శాసనమండలి ఛైర్మన్‌ డా|| చక్రపాణిల అధ్యక్షతన జరిగిన ఉభయసభల రూల్స్‌ కమిటీల సంయుక్త సమావేశం ఆ మేరకు నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. ఒకపక్క ప్రభుత్వం, మరోపక్క ప్రతిపక్ష పార్టీలు స్థాయీసంఘాల ఏర్పాటుకు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభ స్పీకర్‌ ప్రకటించారు.

పార్లమెంటులో స్థాయీ సంఘాల తరహాలో ఇవి వుంటాయని, కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే అమలులో వున్న ఇలాంటి కమిటీల వ్యవస్థను అధ్యయనం చేసి మెరుగైన విధి విధానాలతో రాష్ట్రంలో ఈ స్థాయీ సంఘాలను ఏర్పాటు చేస్తామని స్పీకర్‌ ప్రకటించారు.

గత రెండు దశాబ్దాలుగా నానాటికి తీసికట్టు అన్నట్టుగా శాసనసభ సమావేశాల రోజులు క్రమేణా తగ్గిపోతూ వచ్చాయి. లోతైన చర్చలు మృగ్యం అయ్యాయి. సభా కార్యకలాపాలను స్తంభించడం మీదే ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతుంటే ప్రభుత్వం  పక్షం దానికి దోహదం చేసే రీతిలో ప్రతిస్పందిస్తున్నది. ఎవరు అధికారంలో వున్నా సభ జరుగుతున్న తీరు మాత్రం మారడం లేదు. రోజుకో గందరగోళం, పతాక శీర్షికల కోసం రగడలు, రచ్చలు, టెలివిజన్‌ ప్రసారాలలో హీరోలను తలపించేలా కనిపించాలనే తాపత్రయంతో సభ జరగకపోగా ప్రజాధనం దుర్వినియోగం కావడం నిత్యకృత్యం అయింది. చివరికి బడ్జెట్‌ సమావేశాలలో కూడా అత్యధిక పద్దులపై చర్చలు లేకుండానే పలుశాఖల డిమాండ్ల ఉరికొయ్యలకెక్కుతున్నాయి. ఇక  బిల్లుల పైనా, విధానపరమైన అంశాలపైనా చర్చలు లేకుండా ''మమ'' అనిపిస్తున్నారు. అందువల్లనే చట్టసభల మీద ప్రజల విశ్వాసం నానాటికీ సన్నగిల్లుతున్నది.  ప్రజల అధికార పీఠం ప్రజా సమస్యలపై చర్చించే వేదిక కాకపోగా వాకౌట్లకు, వాగ్యుద్ధాలకు వేదిక కావడం చూపరులకు జుగుప్స కలిగిస్తున్నది.

శాసనసభ పనితీరు పై స్పీకర్‌ పలు సందర్భాలలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఆయన అంతటితో సరిపెట్టుకోకుండా శాసనసభ్యుల భాగస్వామ్యాన్ని పెంచడానికి దోహదం చేసే స్థాయీ సంఘాల ఏర్పాటుకు చొరవతీసుకున్నారు. అటు ప్రభుత్వాన్ని, ఇటు రాజకీయ పార్టీలను ఒప్పించడంలో కృతకృత్యులయారు. వచ్చే శీతాకాల సమావేశాల నాటికి ఈ స్థాయీ సంఘాల ఏర్పాటుకు రంగాన్ని  సిద్ధం చేశారు. ఈ స్థాయీ సంఘాల ఏర్పాటు కాగానే శాసనసభ పనితీరు, సభ్యుల ప్రవర్తన రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యాలు తొలగిపోతాయని  ఎవరైనా భావించడం అత్యాశే అవుతుంది.  ఎందుకంటే వీరంతా దానికే అలవాటు పడ్డారు. ఆ  మూసలో నుండి బైటపడడం అంత తేలిక కాదు. కాని స్థాయీ సంఘాలు అలాంటి మార్పుకు దోహదం చేస్తాయనడంలో  ఆ దిశగా అడుగులు పడేలా చేస్తాయనడంలో ఎలాంటి సందేహానికీ తావులేదు. ఎందుకంటే ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రాలలో ఇలాంటి స్థాయీసంఘాలు విస్తరించడం, అవి సత్ఫలితాలను ఇస్తుండడం స్పష్టంగా కనిపిస్తున్నది.

రాష్ట్ర శాసన సభ చరిత్రలో స్థాయీ సంఘాల ఏర్పాటు ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అయినా మన ప్రింటు ఎలక్ట్రానిక్‌ మీడియాలు ఇంతటి ప్రాధాన్యత గల అంశాన్ని కేవలం  ఒక వార్తగా  ప్రకటించి ఊరుకున్నాయి. అనునిత్యం శాసనసభ  సమావేశాలకి ముందు సంఘర్షణ వాతావరణాన్ని సృష్టించే రాతలు రాయడం, అలాంటి చర్చలను  ప్రసారాలు చెయ్యడం, సభ సజావుగా సాగితే చప్పగా సాగినట్టు వ్యాఖ్యానించడం, సమావేశాల అనంతరం ఎంతకాలం వృధా అయిందీ ఎన్ని కోట్లు ఖర్చు దుబారా అయిందీ వివరించే కధనాలతో ముగింపులు, ముక్తాయింపులతో కాలం గడిపే మీడియా  ఈ సానుకూల పరిణామాన్ని పూర్తిగా విస్మరించడం వాటి స్థితికి అద్దం పడుతుంది.

పార్లమెంటు తరహాలో : చట్టసభలకు స్థాయీ సంఘాలు మన రాష్ట్రానికి కొత్తగాని మన పార్లమెంటుకి, కొన్ని రాష్ట్రాల సభలకి కొత్త కాదు. పార్లమెంటు కార్యకలాపాల నిర్వహణకీ, శాసన సభల నిర్వహణకీ సంబంధించిన వివిధ కమిటీలు చాలా కాలం నుండీ వున్నాయి. పోతే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్థాయీ సంఘాలను ఏర్పాటు పార్లమెంటు స్థాయిలో 1993లో జరిగింది.  అంటే ఇలాంటి స్థాయీసంఘాలకు దేశంలో దాదాపు రెండు దశాబ్దాల చరిత్ర వుంది. ప్రస్తుతం పార్లమెంటుకు ఈ తరహాస్థాయి సంఘాలు 17 వున్నాయి. వీటిలో ఉభయసభలకీ చెందిన వారు సభ్యులుగా వుంటారు. ఇందులో 6 స్థాయీసంఘాల కార్యకలాపాలకు రాజ్యసభ సెక్రటేరియట్‌, 11 స్థాయిసంఘాల కార్యకలాపాలకు లోక్‌సభ సెక్రటేరియట్‌లు తోడ్పాటునందిస్తాయి. ఉభయసభలకు చెందిన ప్రతి సభ్యుడు ఏదో ఒక స్థాయీ సంఘంలో వుంటారు. అయితే మంత్రులకు మాత్రం ఈ కమిటీలో వుండే వీలు లేదు. ఈ స్థాయీ సంఘాల పదవీకాలం ఒక సంవత్సరం వుంటుంది. అంటే 5 ఏళ్లలో ప్రతి సభ్యుడు 5 స్థాయీసంఘాలలో పనిచెయ్యడానికి అనుభవం గడించడానికి వీలు కలుగుతుంది. ఈ సంఘాలలో గరిష్టంగా 45 మంది సభ్యులుంటారు. ఇందులో 30 మందిని లోక్‌సభస్పీకర్‌, 15 మందిని రాజ్యసభ చైర్మన్‌ నామినేట్‌ చేస్తారు.

ఈ స్థాయీ సంఘాలు తమ పరిధిలోని వివిధ ప్రభుత్వశాఖల బడ్జెట్‌ డిమాండ్లను, ఆ శాఖల వార్షిక నివేదికలను దీర్ఘకాలిక విధాన పత్రాలను అధ్యయనం చేసి తగు సూచనలు సిఫారసులను అందజేస్తాయి. ఈ శాఖలకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లులను పరిశీలిస్తాయి.  అయితే వారీ పాలనా వ్యవహారాలలో తలదూర్చవు. మొత్తం మీద ఈ స్థాయీసంఘాలు వివిధ ప్రభుత్వశాఖల ప్రణాళికలు, విధానాలు, పద్దులు, చట్టాల మీద అధ్యయనానికి, నిఘాకి వేదికలుగా వుంటాయి.

రాష్ట్రాలలో....

 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్థాయిసంఘాలు కేరళ, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, తదితర రాష్ట్రాలలో ఏర్పాటై పని చేస్తున్నాయి. ఉదాహరణకి కేరళలోని స్థాయీసంఘాలను తీసుకుంటే వీటికి సభ్యుల్ని స్పీకర్‌ నియమిస్తారు. ఆ సభ్యులలో ఒకరు ఛైైర్మన్‌గా వ్యవహరిస్తారు. పార్లమెంటరీ కమిటీలకు భిన్నంగా ఇక్కడ ఆ శాఖమంత్రి ఈ కమిటీలో ఎక్స్‌అఫీషియా సభ్యులుగా వుంటారు. (ఛైైర్మన్‌గా కాదు) సంబంధిత శాఖ మంత్రి ఇలాంటి కమిటీలకు ఛైర్మన్‌గా వుండకూడదన్నదానిని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. పోతే సభ్యులుగా వుండాలా? వద్దా? అన్న దానిమీద కొంత చర్చ నడుస్తున్నది. రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ దీనిపై చేసిన వ్యాఖ్యను అందరూ పరిగణనలోకి తీసుకోవాలి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయా శాఖల మంత్రులు కీలకపాత్ర పోషిస్తారు. గనుక ఈ స్థాయీసంఘాలలో ఆయా మంత్రులు సభ్యులుగా వుండడం మంచిదని దానివల్ల వివిధ పక్షాలు చేసే సూచనలు, నిపుణులు ఇచ్చే అభిప్రాయాలు, ఈ నిర్ణయాల వల్ల ప్రభావితులయ్యే ప్రజాసమూహాల అభిప్రాయాలు నేరుగా ఆ శాఖమంత్రి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అందువల్ల ఆ మంత్రిత్వ శాఖ మెరుగైన విధానాలు చేపట్టడానికి వీలు కలుగుతుందని హమీద్‌ అభిప్రాయపడుతున్నారు.

పోతే కేరళలో ఈ స్థాయీ సంఘాలకు ఆయా శాఖల డిమాండ్స్‌, బిల్లుల పరిశీలనతోపాటు, ఆ శాఖకు సంబంధించిన ప్రత్యేక అంశాల మీద అధ్యయనానికి, ప్రభుత్వానికి విధానపరమైన అంశాలమీద సూచనలు, రాష్ట్ర ప్రణాళిక మీద, దాని అమలు మీద సిఫారుసులకు వీలు కల్పించారు.

మొత్తం మీద వివిధ శాఖలకు సంబంధించిన ఈ స్థాయీ సంఘాలు ఇటు పరిపాలనలో జవాబుదారీతనానికి, అటు వివిధ పార్టీల శాసనసభ్యుల భాగస్వామ్యానికి, ఏకాభిప్రాయ సాధనకు దోహదం చేస్తున్నందున దేశవిదేశాలలో ఇలాంటి కమిటీల ఏర్పాటు నానాటికీ పెరుగుతున్నది. వాటి విధివిధానాల పరిధి విస్తరిస్తున్నది. పార్లమెంటు, శాసనసభలలో సభ్యుల సంఖ్య పెద్దది కావడంతో సూక్ష్మఅంశాల చర్చకు చాలా సందర్భాలలో అవకాశం లేకుండా పోతున్నది. పైగా అసలు సమస్య కంటే సభ్యులు తమ పార్టీల విధానాలపరంగానే వాదనలు సాగించడం ప్రధాన లక్ష్యం కావడంతో అర్ధవంతమైన చర్చ, ఏకాభిప్రాయ సాధన మృగ్యం అవుతున్నది.

ఈ సభల కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారాల జరగడం వల్ల సభ్యులు ప్రజల దృష్టిని ఆకర్షించడానికే ప్రాధాన్యత ఇవ్వడం సహజం.

మంత్రులకున్నట్టుగా శాసనసభ్యులకు తగిన సమాచారం అందుబాటులో లేకపోవడం, నిపుణులతో సంప్రదింపులకు, పాలనాయంత్రం ముఖ్యులతో చర్చలకు అవకాశాలు తక్కువ కావడంతో సభ్యుల పరిజ్ఞానం, నాయకత్వ పాత్ర పెరగడం లేదు. పైగా పార్టీల మధ్య ఘర్షణే తప్ప సామరస్యపూర్వక చర్చలకు వీలు కలగడంలేదు.

వీటన్నింటికీ స్థాయీసంఘాలు పరిష్కారంగా కనిపిస్తున్నాయి. వివిధ శాఖల మీద, పద్దులు మీద, బిల్లుల మీద మరింత లోతైన చర్చలకు నిపుణుల సలహాలు పొందడానికి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్య ప్రాధాన్యతరీత్య పరిష్కారాలను కనుగొనడానికి ఇవి దోహదం చేస్తాయి. అందువల్ల స్థాయీసంఘాల ఏర్పాటు నిస్సందేహంగా ఒక ఆహ్వానించదగ్గ పరిణామం.





No comments: