రాష్ట్రాలలో కోరలు లేని లోకాయుక్తలు

 రాష్ట్రాలలో కోరలు లేని లోకాయుక్తలు 

                                                                                                                      - డి.వి.వి.యస్‌. వర్మ


2011 మే నెలలో మన రాష్ట్రప్రభుత్వం లోకాయుక్త చట్టానికి కొన్ని సవరణలు తెచ్చింది. లోకాయుక్త పరిధిని కిందిస్థాయి ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు విస్తరింపజేసింది. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌, సర్పంచులు, కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లను, ఆర్‌డివో, అంతకు కిందిస్థాయి రెవెన్యూ  ఉద్యోగులను, డియస్‌పి, తదితర పోలీసు శాఖ సిబ్బందీని దీని పరిధిలోకి తెచ్చారు. అలాగే రాష్ట్రంలో వున్న కేంద్ర ప్రభుత్వం సంస్థలలో పనిచేసే ఉద్యోగుల అవినీతి సంబంధమైన అభియోగాలను దీనిపరిధి కిందకు తెచ్చారు.

అయితే కీలకమైన లోకాయుక్త అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో పనిచేసినా, ఇప్పుడు పనిచేస్తున్న లోకాయుక్తలు, రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్న విధంగా అధికారాల విస్తరణ మాత్రం జరగలేదు.

లోక్‌పాల్‌ బిల్లులో భాగంగా  దేశానికంతటికీ వర్తించే లోకాయుక్తలు కూడా వస్తాయని భావించడం జరిగింది. కాని ప్రాంతీయ పార్టీల ఒత్తిడికి తలొగ్గినందువల్ల లోక్‌పాల్‌లో అంతర్భాగంగా రావాల్సిన లోకాయుక్తలు వచ్చే అవకాశం లేదని తేలింది. ఈ నేపధ్యంలో వివిధ రాష్ట్రాలలో లోకాయుక్తలను సమీక్షించుకోవడం, అవినీతిలో అన్ని రాష్ట్రాలను మంచి అగ్రస్థానంలో వున్న ఈ రాష్ట్రంలో బలమైన లోకాయుక్త సాధనకు ఎంతో అవసరం.

రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని నివారించడానికి ప్రజాప్రతినిధులలో, అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచడానికి లోకాయుక్తలు ఉద్దేశించబడ్డాయి. భారతదేశంలో 1966లో మొదటి పాలనా సంస్కరణల సంఘం ఇలాంటి వ్యవస్థ అవసరాన్ని నొక్కి చెప్పింది. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి, ప్రజాప్రతినిధులలో, పౌరసేవలలో అవినీతిని నిరోధించడానికి ఇలాంటి ప్రత్యేక వ్యవస్థలు అవసరమని భావించింది. జాతీయస్థాయిలో లోక్‌పాల్‌, రాష్ట్రాల స్థాయిలో లోకాయుక్త వ్యవస్థలను సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ఆధారంగా దేశంలో ఈ వ్యవస్థల రూపకల్పనకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి.

కేంద్రంలో లోక్‌పాల్‌ 

1968, 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001 కేంద్రంలో లోక్‌పాల్‌ ఏర్పాటుకు పార్లమెంటు ముందుకు బిల్లులు వచ్చాయి. కాని ఏదో ఒక కారణంతో అది మురుగిపోతూ వచ్చాయి. 2011లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన లోక్‌పాల్‌ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో చతికిలబడి అలాగే వుండిపోయింది.

రాష్ట్రాలలో లోకాయుక్తలు

ప్రస్తుతం దేశంలో 19 రాష్ట్రాలలో లోకాయుక్త -   ఉపలోకాయ్తు చట్టాలు, వ్యవస్థలు వున్నాయి. మహారాష్ట్ర (1971) బీహారు (1973) రాజస్థాన్‌ (1973) ఉత్తరప్రదేశ్‌ (1975) మధ్యప్రదేశ్‌ (1981) ఆంధ్రప్రదేశ్‌ (1983) హిమాచల్‌ప్రదేశ్‌ (1983) కర్నాటక (1985) అస్సాం (1986) గుజరాత్‌ (1986) కేరళ (1988) పంజాబ్‌ (1995) ఢిల్లీ (1996) హర్యానా (1996) లలో ఇలాంటి చట్టాలు, వ్యవస్థలు వచ్చాయి.  దేశంలో మొట్టమొదటిగా ఒరిస్సాలో 1970లోనే ఈ వ్యవస్థ ఏర్పడినా 1993లో దానిని రద్దు చేశారు.

2011లో ఉత్తరాఖండ్‌లో దీనికి ఒక చట్టం చేసినా అది ఇంకా రాష్ట్రపతి ఆమోదం పొందనందున అమలులోకి రాలేదు.

లోకాయుక్తల పనితీరు

దేశంలో మొత్తంమీద లోకాయుక్తల పనితీరు పూర్తిగా నిరాశాజనకంగా వుంది. రాష్ట్రాలలోని పాలకవర్గాలు ఈ వ్యవస్థలను బలోపేతం చెయ్యడానికి బదులు నీరుగారుస్తూ వచ్చాయి. తమ అవినీతిని, పాలనలో అవినీతిని మరుగునపర్చడమే లక్ష్యంగా  వీటికి అధికారాలు, నిధులు, సిబ్బంది లేకుండా చేశాయి. పశ్చిమబెంగాల్‌లో లోకాయుక్త ఆఫీసులో ఇద్దరే ఇద్దరు సిబ్బంది అదీ గ్రూపు డి స్థాయి ఉద్యోగులు మాత్రమే వున్నారు. గుజరాత్‌లో 2003 నుండి 2011 వరకు లోకాయుక్త లేకుండానే సాగిపోయింది. 2011లో గవర్నరు ఈ పదవిని నామినేషన్‌ ద్వారా భర్తీ చెయ్యడంతో ఆయనపై గుజరాత్‌ ప్రభుత్వం విరుచుకుపడింది. కోర్టు తీర్పు ఈ నియామకాన్ని  సమర్ధించింది.

దేశంలోనే కర్నాటకలో వున్న లోకాయుక్త చట్టం బలమైంది. దానికి  అధికారాలు, సిబ్బందికి తగిన ఏర్పాట్లు వున్నాయి. ఈ చట్టం పరిధిలో ముఖ్యమంత్రి కూడా వున్నారు. ఈ లోకాయుక్త ముందు నలుగురు మాజీ ముఖ్యమంత్రుల కేసులు విచారణలో వున్నాయి.  ఇక్కడ లోకయుక్తగా వున్న సంతోష్‌ హెగ్డే ఆ రాష్ట్రంలో జరిగిన గనుల కుంభకోణాన్ని వెలికితీశారు. 12 వేల కోట్ల విలువైన అక్రమ గనుల తవ్వకంలో సాక్ష్యాధారాలను ప్రకటించారు. అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి 21 రోజులపాటు జైలులో వుండాల్సి వచ్చింది. సంతోష్‌ హెగ్డే పదవీవిరమణ తర్వాత 6,7 నెలలు గడిచినా అక్కడ ప్రస్తుతం లోకాయుక్త లేదు. ఒక లోకాయుక్తను నియమిస్తే ఆయనపై ఆరోపణలు రావడంతో వైదొలగారు. తగిన లోకాయుక్త కోసం వెదుకులాడే నెపంతో కాలయాపన సాగిపోతున్నది.

కేరళలో లోకాయుక్త పరిధిలో ముఖ్యమంత్రితో సహా అన్ని స్థాయిల రాజకీయ ప్రజా ప్రతినిధుల మీద, పాలనా వ్యవస్థలోని ఉద్యోగుల మీద అధికారాన్ని కలిగి వుంది. కాని దానికి తనంతట తాను చొరవ తీసుకుని విచారణ జరిపే అధికారం లేదు. దానికి స్వంత సిబ్బంది లేదు. రాష్ట్ర సచివాలయంలో భాగంగానే పనిచేస్తున్నది. అయినప్పటికీ అది యు.డి.ఎఫ్‌ మంత్రి కె.కె.రామచంద్రన్‌ మీద ఉచ్చు బిగించింది. ఆయన రాజీనామా చేయకతప్పలేదు.

2011లో ఉత్తర ప్రదేశ్‌లో లోకాయుక్త కొంత చొరవను ప్రదర్శించింది. మాయావతి మంత్రివర్గంలో 9 మందికి  ఉద్వాసన చెప్పాల్సివచ్చింది. మరో 19 మంది మంత్రుల మీద నేరపరిశోధన  సాగిస్తున్నది. అయితే అక్కడ లోకాయుక్తకి ప్రాసిక్యూషన్‌ నిర్వహించే అధికారం లేదు. నేర పరిశోధన విభాగంలో తగినంత మంది సిబ్బంది లేదు. అంతకు మించి లోకాయుక్త సిఫారసులు ప్రభుత్వం తప్పనిసరిగా అమలుచేసి తీరాలన్న నిబంధన లేదు.

ఇక మిగిలిన రాష్ట్రాలలో ఇలాంటి పరిస్ధితి కూడా లేదు. లోకాయుక్తలను ఏర్పాటు చేసి ఊరుకున్నారే తప్ప అవి పని చెయ్యడానికి తగిన ఏర్పాట్లు ఏ మాత్రం చెయ్యడం లేదు. 1972 నుండీ మహారాష్ట్రకు లోకాయుక్త           ఉన్నప్పటికీ, దానికి నేరపరిశోధన అధికారాలున్నప్పటికీ విచారణ చేసే అధికారం లేదు. స్వంత నేరపరిశోధనకు ఏర్పాటు లేదు. ఆ రాష్ట్రంలో విజిలెన్స్‌ కమిషన్‌ను కూడా ఏర్పాటు చెయ్యలేదు.  1973 నుండి రాజస్థాన్‌లో లోకాయుక్త వ్యవస్థ ఉన్నప్పటికీ దాని పరిధిలో కేవలం ఉద్యోగులు తప్ప ప్రజా ప్రతినిధులు లేరు. దానికి నేర పరిశోధనా విభాగం లేదు. శిక్షించే అధికారమూ లేదు. అస్సాంలో ఉపలోకాయుక్తే లోకాయుక్తగా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రిపై వచ్చిన ''డంపర్‌స్కామ్‌'' విషయంలో లోకాయుక్త ఆయనను నిర్దోషిగా చూపెట్టడం అందరి విమర్శలకూ గురైంది.

తమిళనాడులో లోకాయుక్త ఏర్పాటు గురించి ఎవరూ ఆలోచించిన పాపాన పోలేదు. పైగా కేంద్రంలో ఇటీవల లోక్‌పాల్‌ బిల్లులో భాగంగా రాష్ట్రాలకు లోకాయుక్తలను ఏర్పాటు చెయ్యాలన్న ప్రతిపాదనలను డి.యం.కె. అన్నా డి.యం.కె పార్టీలు రెండూ వ్యతిరేకించాయి. ఇక్కడ విజిలెన్స్‌ డైరెక్టర్‌ అవినీతి నిరోధక సంస్థ దాదాపు అన్ని అవినీతి కేసుల్ని రిజష్టర్‌ చేస్తున్నాయి. అవినీతి నిరోధక సంస్థ ప్రభుత్వం అధీనంలో వుంది. పైగా దానికి ప్రభుత్వ అనుమతి లేకుండా విచారణ చేసే అధికారం కూడా లేదు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త - ఉప లోకాయుక్తలు వున్నారు. 133 మంది సిబ్బంది  ఉండాల్సిన చోట 22 మాత్రమే ఉన్నారు. వీరు చెయ్యగలిగింది నామమాత్రంగానే వుంది. ఎక్కడైనా ప్రభుత్వ యంత్రాంగం విధి విధానాలు అమలులో నిర్దిష్టమైన పొరబాట్లు జరిగితే వాటిని చక్కదిద్దడం. జాప్యం జరిగితే దానిని సరిదిద్దడం వంటి చర్యలు తప్ప తీవ్రమైన నేరాలు చేసిన వారిని బోనులో నిలబెట్టే స్థితి లేదు.

ఇటీవల బీహారులో పాత చట్టాన్ని సవరించారు. ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రుల్ని దాని పరిధిలోకి తెచ్చారు. అయితే దాని అమలుతీరు ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే. ఇకపోతే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు 2011లో అన్ని హంగులు గల బలమైన లోకాయుక్త చట్టాన్ని ఆమోదించింది. అయితే అది అతి తెలివిని ప్రదర్శించింది. గొప్ప చట్టాన్ని తెచ్చామన్న ప్రచారం రావాలి. కాని అది అమలు కాకుండా వుండేలా చూడాలి అన్న సూత్రాన్ని పాటించారు. రాష్ట్రాల అధికారాల పరిధికి మించిన అంశాలను జోడించి ఈ బిల్లును రూపొందించారు గవర్నరు ఆమోదంతో సరిపోయే దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపాల్సి వచ్చింది. అందువల్ల దీని ఆమోదం ప్రశ్నార్ధకంగానే మిగిలింది.

మొత్తంమీద రాష్ట్రాలలో పెచ్చరిల్లుతున్న అవినీతిని అరికట్టే విధంగా ఈ లోకాయుక్తలు లేవు. వీటికి తమంతట తాము కేసు నమోదు చేసే అధికారం వుండాలి. అనుమతుల అడ్డంకులన్నిటినీ తొలగించాలి. లోకాయుక్తలకు స్వతంత్రమైన నేరపరిశోధనా విభాగం, స్వతంత్రమైన ప్రాసిక్యూషన్‌ వ్యవస్థ వుండాలి. సత్వర విచారణలకు ప్రత్యేక కోర్టులు, అక్రమ ఆస్తుల స్వాధీనానికి అధికారాలు వుండాలి. లోకాయుక్తల నియామకం పారదర్శకంగా ప్రభుత్వం ప్రతిపక్ష నేత, ప్రాతినిధ్యం వహించే కమిటీ ఏకాభిప్రాయంతో సాగే పద్ధతి వుండాలి. సమర్థులనీ, నిజాయితీ పరుల్ని ఎంపిక చెయ్యడం మీద శ్రద్ధ చూపాలి అలాంటి కోరలు గల లోకాయుక్తలు మాత్రమే అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి. ప్రజా చైతన్యంతోనే ఇలాంటి వ్యవస్థలు సాధ్యం అవుతాయి.  

                                                   ***






 




No comments: