లక్ష్య సాధనాలుగా నగదు బదిలీలు

              లక్ష్య సాధనాలుగా నగదు బదిలీలు  

                                                                                              - డి.వి.వి.యస్‌. వర్మ

2012 సెప్టెంబర్‌ 1 నుండి రాష్ట్రంలో కిరోసిన్‌కు నగదు బదిలీ పధకం ప్రయోగాత్మకంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్‌ జిల్లాలో 10, తూర్పుగోదావరి జిల్లాలో 35,  మొత్తం 45 రేషన్‌షాపులలో ఈ పధకం అమలుకు శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం పట్టణాలలో రేషన్‌కార్డుల మీద పేదలకు నెలకు నాలుగు లీటర్లు, ఇతర ప్రాంతాలలో రెండు లీటర్లు, దీపం పధకం కింద సిలిండర్‌ పొందిన వారికి 1 లీటరు చొప్పున రేషన్‌షాపుల ద్వారా  ఇస్తున్నారు. ప్రభుత్వం లీటరు కిరోసిన్‌కు  48 రూపాయలకు కొనుగోలు చేసి లబ్ధిదారులకు 15 రూపాయలకు అందిస్తున్నది. అంటే ప్రతి లీటరుకు ప్రభుత్వం 33 రూపాయలు సబ్సీడీని భరిస్తున్నది. ఈ నగదు బదిలీ అమలులోకి వచ్చేచోట ఎన్ని లీటర్లకు లబ్ధిదారులు అర్హులైతే అన్ని లీటర్లకు 33 రూపాయల వంతున వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. లబ్ధిదారులు మార్కెట్‌ ధరకు కిరోసిన్‌ను కొనుగోలు చేసుకోవాలి. ఒక నెలలో వారు కొనుగోలు  చేయకపోతే ఆ మొత్తం తిరిగి ప్రభుత్వానికి చేరుతుంది. లబ్ధిదారులకు విధిగా ఆధార్‌కార్డులు వుండేలా, బ్యాంకు ఖాతాలు వుండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా జరిగినప్పటికీ ప్రభుత్వం ఆశిస్తున్నట్లుగా కిరోసిన్‌ అవసరం లేని కొనుగోలుదారుల్ని, ఆ తర్వాత జరిగే బ్లాక్‌ మార్కెట్‌నూ ఇది నిరోధించేదిగా లేదు. గతంలో లాగే అవసరం లేనివారు లీటరుకు పదో, పదిహేనో డబ్బును డీలర్‌ నుండి పొంది సంతృప్తిపడే పరిస్థితే  కొనసాగుతుంది. పోతే నిజంగా అవసరం వున్న వారికి మార్కెట్‌లో కిరోసిన్‌ ధర పెరిగితే ఆ అదనపు మొత్తాన్ని తామే భరించుకోవలసి వస్తుందన్న ఆందోళన వుంది.  అందుచేత నగదు బదిలీ పధకాలను ప్రవేశపెట్టేముందు అనుకున్న లక్ష్యాలు సాధించే విధంగా వాటిని రూపొందించడం అవసరం.

 

2012-13 సంవత్సరానికి కేంద్రబడ్జెట్‌పై ఆర్ధికమంత్రి ప్రసంగంలో ఎరువులు, గ్యాస్‌సిలిండర్లు, కిరోసిన్‌లపై ఇస్తున్న పరోక్ష సబ్సీడీల స్థానంలో నేరుగా లబ్ధిదారుకు నగదు బదిలీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇది చిన్న విషయం కాదు. విధానపరంగా పెద్దమలుపు. దీనివెనుక చాలా కారణాలు వున్నట్టు కనిపిస్తున్నది. రాను రాను సబ్సీడీల భారం పెరుగుతూపోవడంతో బడ్జెట్లు దీనిని భరించలేని స్థితి ఏర్పడింది. 2001లో 7, 500 వేల కోట్లు వున్న కిరోసిన్‌ సబ్సీడీ 2011నాటికి 20 వేల 500 కోట్లకు పెరిగింది. అదేకాలంలో  గ్యాస్‌ సిలిండర్ల మీద సబ్సీడీ 6 వేల 700 కోట్లు నుండి  24,000 కోట్లు అయింది. డీజిల్‌ మీద సబ్సీడీ 7,500 కోట్లు నుండి 34,000 కోట్లు, ఎరువుల మీద వున్న14,000 కోట్లు వుంటే అది 55,000 కోట్లకీ, ఆహార వస్తువుల మీద 12,000 కోట్లు వుంటే సబ్సీడీ 2011 నాటికి 60,500 కోట్లు అయింది. ఇంతగా సబ్సీడీలు ఇస్తున్నా వ్యవసాయరంగంలో, పేదరికనిర్మూలనలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. పైగా ఈ సబ్సీడీలు దారిమళ్లడం, అవినీతికి ఆలవాలం కావడం సాగిపోతున్నది. సొమ్ముపోయే శనిపట్టినట్టు పరిస్థితి తయారైంది.

 

మరొకపక్క బోగస్‌కార్డుల ఏరివేతకు తగిన సాంకేతిక పరిజ్ఞానం రావడం, ఆధార్‌కార్డుల పంపిణీ పెద్దఎత్తున సాగించడం, బ్యాంకులు, పోస్టాఫీీసులు ఆర్ధిక లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించగల స్థితిలో వుండడం, జాతీయ ఉపాధిపధకం అమలులో నేరుగా లబ్ధిదారులకు వేతనాల పంపిణీ వంటి అనుభవాలు గత సబ్సీడీపద్ధతి మార్చాలన్న ప్రయత్నాలకు సానుకూల అంశాలుగా భావించబడుతున్నాయి. ప్రపంచంలో పలుదేశాలలో పేదరికనిర్మూలనకు నిర్దేశిత లక్ష్యాల సాధనకు నగదు బదిలీ పధకాలు అమలు అవుతున్నాయి. షరతులతో కూడిన నగదు బదిలీపధకాలు లాటిన్‌ అమెరికా దేశాలలో మంచి ఫలితాలు సాధించడంతో అందరి దృష్టి వాటిమీద పడింది. 

 

బ్రెజిల్‌లో షరతులతో కూడిన నగదు బదిలీ పధకాలను 2003లో ఏకీకృతం చేసి బోల్సాఫెమిలియా పేరుతో నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రాధమిక విద్యకు కనీసగ్రాంటు, ఆహారభద్రతకు సంబంధించిన నగదు బదిలీ;  వంటగ్యాస్‌కు ఇచ్చే సబ్సీడీలను నగదు బదిలీ చేస్తున్నారు. కుటుంబంలోని  మహిళ యజమానురాలి పేరుమీద ''సిటిజన్‌ కార్డు'' పంపిణీ చేసి బ్యాంకుల ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు. దీని ఫలితంగా పోషకాహారలోపం గణనీయంగా తగ్గడం ,బడి బయట పిల్లలు లేకపోవడం, మధ్యంతరంగా  మానేసేవారి సంఖ్య బాగా తగ్గడం, పిల్లలకి వ్యాధినిరోధక టీకాలు పూర్తిస్థాయిలో జరగడం వంటి ఫలితాలు బాగా మెరుగైనట్లు అన్ని దేశాలు అంగీకరిస్తున్నాయి.

 

ఈ నగదు బదిలీ పధకం 1997లో మెక్సికోతో ప్రారంభించారు. ముందుగా  ప్రొగైసా పేరుతో ప్రారంభమై తర్వాత నగదు బదిలీపధకం ''ఆ పర్చు నిడాడెస్‌'' పేరుతో విస్తరించింది. అక్కడ కూడా ఫలితాలు ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించే విధంగా వచ్చాయి. అనేక దేశాలు నగదు బదిలీబాట పట్టాయి. కొలంబియా 2000 సంవత్సరంలో, ఎల్‌సాల్వెడార్‌లో 2005లో, నికరగ్వువాలో 2000లో,  పరాగ్వేలో 2005లో, దక్షిణాఫ్రికాలో 1998లో, ఇలా చాలా దేశాలకు నగదు బదిలీ పధకాలు విస్తరించి అమలులో వున్నాయి.   వివిధ దేశాలలో నగదు బదిలీ పధకాలు సారిస్తున్న ఫలితాల ప్రభావం కూడా నగదు బదిలీల మీద దృష్టిపడడానికి కారణంగా కనిపిస్తున్నది. 

 

నగదు బదిలీ అన్నపేరు వాడకపోయినా ప్రత్యక్షంగా లబ్ధిదారులకు నగదు చెల్లించే పద్ధతి మన దేశానికి, రాష్ట్రాలకి కొత్తకాదు. జీవనభద్రత కోసం సంక్షేమ పధకంగా ఇస్తున్న పెన్షన్‌లు మాతా శిశు సంరక్షణకు ప్రవేశపెట్టిన పలు పధకాలు నగదు బదిలీ పధకాలే. ఒకనాడు నిర్వహించిన ''పనికి ఆహారం'' పధకం  వస్తు బదిలీపధకం అయితే ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పధకం పేరుతో అతిపెద్ద నగదు బదిలీ పధకంగా వుంది. బడుగు బలహీనవర్గాల పిల్లల చదువులకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్లు నగదు బదిలీ పధకాలే.

అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభించిన కిరోసిన్‌కు నగదు బదిలీ లేదా గ్యాస్‌ సిలిండర్లు, ఎరువుల సబ్సీడీలకు నగదు బదిలీ పధకాలు కొంత సంక్లిష్టమైనవి. ఈ పధకాలను తగిన జాగ్రత్తలతో రూపొందించకపోతే ఇటు ప్రభుత్వానికి, అటు లబ్ధిదారులకీ ప్రయోజనం కలగని స్థితి వస్తుంది. 

 

ఇప్పుడు కిరోసిన్‌ నగదు బదిలీ అంశాలను మరింత లోతుగా పరిశీలించాలి. పేదలు వంట చేసుకోడానికి, దీపాలు వెలిగించుకోడానికి వీలుగా సబ్సీడీపై కిరోసిన్‌ను ఇస్తున్నారు. కిరోసిన్‌ మీద ఎంతమంది వంట చేసుకుంటున్నారు. దీపాల కోసం ఎంతమందికి కిరోసిన్‌ అవసరం అన్న దానితో నిమిత్తం లేకుండా ప్రతి రేషన్‌కార్డుకీ ఒకే తీరున కిరోసిన్‌ పంపిణీతో ఈ సబ్సీడీ తలబరువైంది. అవసరం లేనివాళ్లు చౌకగా తిరిగి డీలర్‌కే అమ్మడం, పెద్దస్థాయిలో కిరోసిన్‌ బ్లాక్‌ మార్కెట్‌కీ, డీజిల్‌లో కల్తీకి కారణం అవుతున్నది. 

 

మనదేశంలో గ్రామీణప్రాంతంలో కిరోసిన్‌తో  వంట చేసుకునేవారు శాతం 2001లో 2 శాతం వుంటే అది 2008 నాటికి 0.6 శాతానికి పడిపోయింది. పట్టణాలలో అదే కాలంలో 15.3 శాతం నుండి 7.6 శాతానికి తగ్గింది. నిజానికి దేశంలో కిరోసిన్‌ను వంటకంటే దీపాలకే ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కిరోసిన్‌ దీపాలు వాడే వారి సంఖ్య 2002లో 47.2 శాతం  వుంటే, అది 2008కి 38.00 శాతానికి తగ్గింది. అదేకాలంలో పట్టణాలలో 7.8 శాతం నుండి 5 శాతానికి పడిపోయింది. ఆసియా దేశాలలో అతి ఎక్కువ సబ్సీడీతో అతి తక్కువ ధరకి అందిస్తున్న దేశంగా భారతదేశం వుంది. తగ్గుతున్న కిరోసిన్‌ వాడకాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కార్డుదారులందరికీ పంపిణీ చేయడంతో అది పెద్దస్థాయిలో బ్లాక్‌ మార్కెట్‌కి తరలిపోతున్నది. మహారాష్ట్రలో అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ కలెక్టరు యస్వంత్‌సోనావానే హత్య కిరోసిన్‌ మాఫియా చేసిందే. ఇలాంటి హత్యలు ఇప్పటికీ జరుగుతూనే వున్నాయి.  కిరోసిన్‌పై ఇస్తున్న 20,000 కోట్ల సబ్సీడీలో 8000 కోట్లు ఈ మాఫియాలపరం అవుతున్నది. దీనిని డీజిల్‌లో కల్తీ చెయ్యడంతో ఒక పక్క వాయుకాలుష్యం, మరోపక్క ట్రక్కులు, కార్లు రిపేర్ల పాలవుతున్నాయి. అందుచేత అవసరమైన వారికి మాత్రమే కిరోసిన్‌ అందే ఏర్పాటు వుండాలి తప్ప మూకుమ్మడిగా సబ్సీడీ కిరోసిన్‌ పంపిణీ చెయ్యడం మాఫియాలను పెంచిపోషించడం అవుతుంది. 

 

కాని ప్రస్తుతం సబ్సీడీ కిరోసిన్‌కు నగదు బదిలీ పధకాన్ని వర్తింపజేసినా అదనపు కిరోసిన్‌మాత్రం బ్లాక్‌ మార్కెట్‌కు రావడం ఆగిపోదు. అందుచేత నగదు బదిలీ పధకాలు ప్రభుత్వ వ్యయాన్ని దుబారాని తగ్గించేవిగా, లబ్ధిదారులకు నేరుగా సబ్సీడీని  అందించేవిగా వున్నప్పటికీ, అసలు పధకంలోనే లోపాలుంటే పరిస్థితి యధాతధంగానే వుంటుంది. లక్ష్యసాధనకు మార్గాలుగా షరతులతో కూడిన నగదు బదిలీలను అత్యంత లోపరహితంగా రూపొందించినప్పుడే ఇది సత్ఫలితాలను ఇస్తాయి. 


No comments: