గ్రామీణ పాఠశాలల విద్యా స్థితిపై అసర్‌ నివేదిక
పెరుగుతున్న పిల్లల నమోదు తరుగుతున్న విద్యాప్రమాణాలు

                                                                                                                  - డి.వి.వి.యస్‌. వర్మ                                                                          
 2012 సంవత్సరం ముగిసింది. దేశంలో పాఠశాల విద్యపై అసర్‌ (యాన్యువల్‌ స్టేటస్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు) వార్షిక నివేదిక 2013 జనవరి 17న కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి డా.యం.పళ్లంరాజు చేతుల మీదుగా విడుదలైంది. ఈ నివేదికలో వెల్లడైన అంశాలు పాఠశాల విద్య గురించి అందరూ మాట్లాడుకుంటున్నవే అయినప్పటికీ వాటిని పదేపదే ఒక ప్రామాణికమైన వార్షిక సర్వే ద్వారా అసర్‌ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

మన పిల్లల చదువుకు పాఠశాల విద్య పునాది. ఈ చదువే మన సమాజంలో చాలా సమస్యలకు పరిష్కారం. మంచి ప్రమాణాల చదువు దేశాన్ని తిరుగులేని అభివృద్ధి క్రమంలో నడిపిస్తుంది. ప్రజలకు స్వతంత్ర జీవనాన్ని కల్పిస్తుంది. అంతకుమించి మన సమాజంలో అనేక వివక్షలున్నాయి. కులవివక్ష, లింగవివక్ష, పేదరికపు వివక్షలున్నాయి. చదువు ఈ అంతరాలను తొలగిస్తుంది. వారి సామాజిక హోదాను మారుస్తుంది. ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరిగే స్వతంత్ర జీవనాన్ని ఇస్తుంది.

మనకి ప్రభుత్వ లేదా ప్రయివేటు పాఠశాలలు ఇబ్బడి ముబ్బడిగా వున్నాయి. పిల్లల నమోదు శాతం గణనీయంగా పెరుగుతున్నది. ఏటా పిల్లలు తరగతులు దాటుతున్నారు. డిగ్రీలు, డిప్లమోలు పొందుతున్నారు. కాని పనికొచ్చే చదువు మాత్రం దక్కడం లేదు. పిల్లల శక్తి సామర్ధ్యాలను ఈ చదువు పెంచడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయి. ప్రయివేటు పాఠశాలలు నిత్యపరీక్షల పేరుతో రుబ్బుడు, దిద్దుడు తప్ప పిల్లలలో వివేచనాశక్తిని పెంచడం లేదు .

ఈ స్థితిని ఒక అసర్‌ నివేదికలే కాదు, భారతదేశంలో విద్యమీద జరిపిన సర్వేలన్నీ ఈ స్థితికి అద్దం పడుతున్నాయి. గత  సంవత్సరం వచ్చిన మూడు రిపోర్టులు దీనిని ధృవపరుస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి వహించిన ''పీసా'' సర్వేప్రకారం భారతదేశంలో 10వ తరగతి పిల్లల చదువు సామర్ధ్యం అత్యంత హీనస్థితిలో వున్నట్లు  వెల్లడించింది.  ఆ సంస్థ 74 దేశాలలో విద్యాస్థితిని అంచనా వేస్తే  భారత దేశం 73వ స్థానంలో అట్టడుగున నిలిచింది.  చైనా మొదటి స్థానంలో  వుండగా అమెరికా 16వ స్థానాన్ని పొందింది.  విద్యార్థుల మాతృభాషా పరిజ్ఞానాన్ని, లెక్కలలో సామర్థ్యాన్ని, వారి తర్క పుష్టిని ప్రమాణాలుగా తీసుకుని చేసిన సర్వేలో మన పిల్లల వెనకబాటుతనం స్పష్టమైంది.

అలాగే విప్రో ఇఎల్‌ చేసిన క్వాలిటీ ఎడ్యుకేషన్‌ స్టడీ ప్రకారం అగ్రస్థానంలో వున్న కొన్ని ప్రయివేటు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు 2006నాటి కంటే 2010లో చాల బలహీనపడ్డాయని తేల్చింది. అలాగే గత 2011 అసర్‌ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు నానాటికీ తీసికట్టు కావడాన్ని చూపించింది.

భారతదేశంలో ప్రధమ్‌ సంస్థ 2005 నుండి క్రమం తప్పకుండా వార్షిక విద్యాస్థితి నివేదికలను విడుదల  చేస్తున్నది. ఈ 2012 సర్వే 8వ వార్షిక నివేదిక. ఈ సర్వే 567 జిల్లాలలో 1600 గ్రామాలలో 3.3 లక్షల కుటుంబాలకు చెందిన  3-16 సంవత్సరాల పిల్లల చదువు స్థితి మీద నిర్వహించారు. 6 లక్షల మంది విద్యార్థుల చదువు సామర్ధ్యాన్ని  అంచనా కట్టారు. పనిలో పనిగా 2010 విద్యాహక్కు చట్టం వచ్చిన తర్వాత  ఆ చట్టం ప్రమాణాలు పాఠశాలలలో ఎలా వున్నాయో పరిశీలించడానికి 14,600 ప్రభుత్వ పాఠశాలల స్థితిని సేకరించారు. వీటన్నింటి ఫలితాలను క్రోడీకరించి 2012 అసర్‌ నివేదికగా వెల్లడించారు.


గ్రామీణ భారతంలో విద్యాస్థితి

పాఠశాలలో 6-14 వయసు గల పిల్లల నమోదు హెచ్చుస్థాయిలోనే 96.5 శాతంగా వుంటున్నది. పాఠశాలలో నమోదు కాని వారి సంఖ్య 3.3 నుండి 3.5 శాతం మధ్య వుంటున్నది. పోతే 11-14 సంవత్సరాల వయస్సు గల బాలికలు పాఠశాలలకు దూరం కావడం పెరుగుతున్నది.  ఇందులో రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లు 11 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి.

ప్రయివేటు మోజు

అన్ని రాష్ట్రాలలో 2006లో ప్రయివేటు పాఠశాలలో 18.7 శాతం  బాలబాలికలు వుంటే 2012లో ప్రైయివేటు పాఠశాలలో పిల్లల వాటా 28.3 శాతానికి పెరిగింది. అత్యధికంగా కేరళ, మణిపూర్‌లలో 60 శాతం మంది, జమ్ము-కాశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గోవా, మేఘాలయాలలో 40 శాతం మంది బాలబాలికలు ప్రయివేటు పాఠశాలల్లోనే వున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా జాతీయ సరాసరిని మించి 36.5 శాతం మంది ప్రయివేటు పాఠశాలల్లోనే వున్నారు.

మొత్తంమీద ప్రయివేటు పాఠశాలలో పిల్లల నమోదు సంఖ్య ప్రతిఏటా 10 శాతం చొప్పున పెరుగుతున్నది. ఇలాగే కొనసాగితే 2018 నాటికి ప్రయివేటు పాఠశాలల్లో పిల్లల నమోదు 50 శాతానికి మించుతుందని ఈ నివేదిక అంచనావేసింది.


చదువు ఎలా వుంది

దేశవ్యాప్తంగా 2010లో 46.3 శాతం 5వ తరగతి పిల్లలు 2వ తరగతి స్థాయి పుస్తకాన్ని చదవలేకపోయారు. అలాగే 2011లో ఇది 51.8 శాతానికి, 2012లో 53.2 శాతానికి చదవలేని వారి సంఖ్య పెరిగింది. చదవలేని వారు ప్రభుత్వ పాఠశాలల్లో కొంచెం ఎక్కువగా ఉన్నారు. 2010లో 49.3 శాతం, 2011లో 56.2 శాతం, 2012లో 58.3 శాతం అంటే చదవలేని పిల్లల సంఖ్య పెరుగుతున్నది.

2010లో 5తరగతి చదువుతున్న పిల్లలలో 29.1 శాతం 2 సంఖ్యల తీసివేతల్ని  చేయలేకపోయారు. అది 2011 కల్లా 39 శాతానికి చేరి, 2012 కల్లా 46.5 శాతానికి చేరుకుంది.

5వ తరగతి చదువుతున్న పిల్లలలో 2010లో 63.8  2011లో 72.4 , 2012లో 75.2 శాతం మంది పిల్లలు చిన్న చిన్న భాగాహారాలు కూడా చేయలేకపోతున్నారు. 

2012 అసర్‌ సర్వేలో తేలిక ఇంగ్లీషు పదాలు, వాక్యాల చదువు సామర్థ్యాన్ని కూడా పరీక్షించారు. గ్రామీణ భారతంలో  5వ తరగతి చదువుతున్న పిల్లలలో 51.1 శాతం మంది   ఇంగ్లీషు పదాలు చదవలేకపోతున్నారు.

5వ తరగతి పిల్లలు ఇంగ్లీషులో సామాన్య వాక్యాలను 77.5 శాతం మంది చదవలేకపోతున్నారు. అలాగే ఏడవ తరగతి పిల్లలలో 53 శాతం మంది ఇంగ్లీషు వాక్యాలను చదవలేక పోతున్నారు.


ట్యూషన్లకు ఎంతమంది వెళుతున్నారు....

ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో కలిపి 1 నుండి 8వ తరగతి వరకు మొత్తం నమోదయిన పిల్లలలో  4వ వంతు పిల్లలు ప్రైవేటు ట్యూషన్లకు వెళుతున్నారు.

2012లో ప్రభుత్వ పాఠశాలలలో 5వ తరగతి  చదువుతూ ట్యూషన్లకు వెళ్ళని వారు 54.5 శాతం.  ట్యూషన్లకు వెళ్ళేవారు 18.8 శాతం వున్నారు.

టూషన్లకు వెళుతున్నవారి సామర్థ్యాలు, వెళ్ళని వారి కంటే పెరుగుతున్నాయన్నది ఈ సర్వేలో తేలింది.

గత రెండేళ్లలో ట్యూషన్‌కు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థు సంఖ్య తగ్గింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే ఐదో తరగతి విద్యార్థులు 2011లో 13% మంది ట్యూషన్లకు వెళ్లగా.... 2012లో అది 7.7 శాతానికి తగ్గింది.


ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే స్థితి


రాష్ట్రంలో 6-14 ఏళ్ల పిల్లల్లో 97.4% మంది బడుల్లో చేరారు. 2007 సంవత్సరంతో పోలిస్తే ఇది 1.6% పెరిగింది.

11-14 ఏళ్ల పిల్లల్లో 5.1% మంది ఇప్పటికీ బడులకు వెళ్లటం లేదు. దేశవ్యాప్తంగా వీరి శాతం మరింత ఎక్కువగా కనిపిస్తోంది.

మూడో తరగతి విద్యార్థుల్లో 48.7% మంది మాత్రమే ఒకటో తరగతి పాఠ్యపుస్తకాలను చదవగలుగుతున్నారు.

ఐదో తరగతి విద్యార్థుల్లో 59.4% మంది మాత్రమే రెండో తరగతి పాఠ్యపుస్తకాలను చదవగలుగుతున్నారు.

ఐదో తరగతి చదివేవారిలో 40% మంది ప్రాథమిక పఠన నైపుణ్యాలు  వుండటం లేదు. మూడో తరగతి పిల్లల్లో సగం మంది మాత్రమే రెండంకెల తీసివేత లెక్కలను చేయగలుగుతున్నారు. ఇక ఐదో తరగతి విద్యార్థుల్లో 41.1% మందికే భాగహారం లెక్కలు చేయటం తెలుసు. అంటే 59% మంది విద్యార్థులు కనీస గణితస్థాయిలను అందుకోకుండానే ప్రాథమిక పాఠశాల చదువు పూర్తిచేస్తున్నారు.

మూడో తరగతి చదివేవారిలో 61.4% మంది పిల్లలు ఆంగ్లలో సరళ పదాలను చదవగలుగుతున్నారు. మిగిలిన వారిలో కొందరు  అక్షరాలను మాత్రమే గుర్తించగలుగుతున్నారు. 65.5% విద్యార్థులు మాత్రమే పదాల అర్థాలను ఆంగ్లంలో చెబుతున్నారు.

మొత్తంమీద  పాఠశాల విద్యాస్థితి దారుణంగా వుందనేది ఈ రిపోర్టు సారాంశం. ఇక సమస్యల వర్ణనవల్ల అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ వుండదు. ఈ స్థితిని మార్చడం ఎలా అన్నదే అసలు ప్రశ్న.

పాఠశాల విద్యలో అరకొర మార్పులు పరిస్థితిని చక్కదిద్దలేవు. ఒక ప్రణాళికతో సమగ్రమైన ప్రక్షాళనకు పూనుకోవాలి. సిలబస్‌ మారాలి, పుస్తకాలు మారాలి, బోధన మారాలి. మాతృభాషలో బోధన, ఇంగ్లీషు నేర్పించడాన్ని మేళవించాలి. విద్యార్థుల స్థాయిని అంచనా కట్టడానికి ఏదో ఒక తరహా పరీక్షలుండాలి. ఉపాధ్యాయులలో జవాబుదారీతనం పెంచడానికి  అజమాయిషీని పటిష్టం చెయ్యడానికి తగిన ప్రోత్సాహకాల పద్ధతుల్ని ప్రవేశపెట్టాలి. ప్రభుత్వ, ప్రయివేటు తేడా లేకుండా  అందరికీ మంచి ప్రమాణాల విద్య అందాలి. దీనికి ప్రభుత్వాలు చొరవ చూపాలి. మన రాజకీయానికి ఓట్ల ధ్యాస వుందే తప్ప మార్పు యోచన లేదు. డబ్బుతో, కులంతో, పేదరికంతో నిమిత్తం లేకుండా అందరికీ మంచి ప్రమాణాల విద్యను అందించడం.  లక్ష్యంగా విధానపరమైన రాజకీయ చర్చ జరిగితేనే తప్ప పిల్లల చదువుకు భవిష్యతు వుండదు. 
 
                                                                          ***

No comments: