కొత్త చొరవల పదును లేని కేంద్ర బడ్జెట్‌

             కొత్త చొరవల పదును లేని కేంద్ర బడ్జెట్‌

                                                                                                                     - డి.వి.వి,యస్‌. వర్మ    
                                                                                                                  dvvsvarmablogspot.com
 
కేంద్ర బడ్జెట్‌ మీద ఈసారి దేశంలో కొంత ఆతృత కనిపించింది. 1991లో సరళీకరణ ప్రారంభం అయిన తరవాత రాను రాను బడ్జెట్ల మీద ప్రజల్లో ఆసక్తి తగ్గుతూ వచ్చింది. మొదటిది అంతవరకు ప్రతి బడ్జెట్‌లోనూ ప్రతి వస్తువుమీదా ఎంతోకొంత వడ్డింపులు వుండేవి. ఒకటి అరా రాయితీలు వుండేవి. బడ్జెట్‌ బయట వడ్డింపులు తక్కువగా వుండేవి. ఓటు బ్యాంకు ప్రజాకర్ష పధకాలు తక్కువగానే వుండేవి. ఇప్పుడు బడ్జెట్‌లో పన్నుల పెంపకాలు దాదాపు లేకుండా పోయాయి. వాట్‌తో దాని పని అది చేసుకుపోతున్నది. ఇక జి.యస్‌.టి వస్తే ప్రభుత్వాల పని మరీ తేలికవుతుంది.- ఇక రెండోది ప్రభుత్వ నియంత్రణలో వున్న వాటి ధరలను బడ్జెట్‌ వెలుపల పెంపుదల వుండేది. ఇప్పుడు గ్యాస్‌, ఆయిల్‌, ఫెర్టిలైజర్లు, ఇనుము, సిమ్మెంటు ఒక్కొక్కటి స్వేచ్ఛా మార్కెట్‌లోకి వచ్చేశాయి.  అందువల్ల బడ్జెట్‌ అంటే కేవలం ఆదాయపు రాయితీలకు ఎదురుచూడడం తప్ప అంతా షరా మామూలే కావడంతో ప్రజల్లో ఆసక్తి తగ్గింది.  వ్యాపార-వాణిజ్యవర్గాలు కూడా కొన్ని విధానపరమైన అంశాలకోసం ఎదురుచూడడం తప్ప ఆతృత వుండకుండా పోయింది. ఇదంతా మంచి పరిణామమే.

2013-14 బడ్జెట్‌కు వున్న నేపథ్యం వల్ల దీనిమీద చాలామంది ఆసక్తి చూపించారు. ఒకటి ఆర్థికాభివృద్ధి వేగం మందగించటం, ద్రవ్యోల్బణం ఎంతకీ దిగి రాకపోవడం, ప్రభుత్వం ఎన్నికల ముందు సంవత్సరంలోనే గ్యాస్‌, ఆయిల్‌ ధరలు మార్కెట్‌ ధరలకు దాదాపు దగ్గర చెయ్యడం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం, సబ్సిడీలను క్రమబద్ధం చెయ్యడానికి నగదు బదిలీని ప్రారంభించడంలాంటి చర్యలు తీసుకోవడంతో ఈ బడ్జెట్‌లో అదే దూకుడు వుంటుందని చాలామంది భావించారు. మందగించిన ఆర్థికాభివృద్ధిని తిరిగి పరుగులు తీయించడానికి కీలకరంగాలలో చర్యలు ఉంటాయని భావించారు. రెండోది ఎన్నికలకు  ముందు వున్న బడ్జెట్‌ గనుక జనాకర్షణ పధకాల వెల్లువ వుంటుందని ఊహించారు. ఈ పూర్వరంగంలో బడ్జెట్‌ విశ్లేషణ చేసుకోవడం అవసరం.

2013-14 సంవత్సరానికి 16,65,297 కోట్ల బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ద్రవ్యలోటును 5.2 గానూ, సంవత్సరాంతానికి ద్రవ్యలోటు 4.8 కానున్నట్లు ప్రకటించారు. ముందుగా ద్రవ్యలోటును  అదుపులో వుంచడంలో ఆర్థికమంత్రి కృతకృత్యులయ్యారనే చెప్పాలి. గ్యాస్‌, ఆయిల్‌, నగదు బదిలీలపై తీసుకున్న చర్యలు ఆర్థికమంత్రికి ఈ వెసులుబాటును కల్పించాయనే చెప్పాలి. కేవలం ద్రవ్యలోటు అదుపులో వున్నంత మాత్రాన పరిస్థితి సజావుగా వుందని ఎవరూ భావించకూడదు. మరొకపక్క ద్రవ్యోల్బణం ఇంకా వేధిస్తున్న సమస్యగానే వుండిపోయిందని గుర్తుంచుకోవాలి. 

ఇది ఎన్నికల బడ్జెట్‌

 

ఈ బడ్జెట్‌లో ఎన్నికల దృష్టి స్పష్టంగా కనిపిస్తున్నది. ఆర్థిక మంత్రి చిదంబరం మూడు తరగతులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు     తన ప్రసంగంలోనే ప్రకటించారు. వారికి వాగ్దానాలను ఇచ్చారు.  దేశప్రజలలో మెజారిటీగా వున్న మహిళలు, యువత, పేదలను ఆకర్షించడానికి ఈ బడ్జెట్‌ను ఎక్కు పెట్టారు.  ఇటీవల ఢిల్లీలో జరిగిన అమానుష మానభంగం ఘటన నేపథ్యంలో మహిళల రక్షణకు, సాధికారతకు ''నిర్భయనిధి'' పేరుతో 1000 కోట్లు ప్రకటించారు. అలాగే మహిళలకు ప్రత్యేక బ్యాంకును ప్రతిపాదించారు. ఇది స్వయంసహాయ సంఘ మహిళల అవసరాలను, మహిళా వ్యాపార వాణిజ్యవేత్తల అవసరాలను తీరుస్తుందని ప్రకటించారు.  అలాగే మహిళా శిశు సంక్షేమానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలకు 97,134 కోట్లు కేటాయింపులు చేశారు.

యువతకు నైపుణ్యాల అభివృద్ధికి నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను గతంలోనే ఏర్పాటు చేశారు. 10,00,000 మంది యువతకు ప్రత్యేక శిక్షణ పొందేలా వారిని ప్రోత్సహిస్తామని ఇందులో నైపుణ్యాల ప్రత్యేక పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్‌తోపాటు 10,000 రూపాయలు నజరానాను ప్రకటించారు. ఉద్యోగార్హమైన నైపుణ్యాలను పొందడానికి ఇది ప్రోత్సాహకారి అవుతుందని అన్నారు.

పేద ప్రజల కోసం ప్రారంభించిన నగదు బదిలీ పధకం ''మీ సొమ్ము మీ చేతికి'' అన్న నినాదంతో విస్తరించబోతున్నట్లు వెల్లడించారు. అలాగే అసంఘటిత రంగంలో వున్న రిక్షాడ్రైవర్లు, ఆటోడ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు వంటి వారికి బీమా పథకాన్ని  వర్తింపచేశారు.

మొత్తంమీద రాబోయే ఎన్నికల్లో మహిళల్ని, యువతని, పేదలనీ ఆకర్షించడానికి ఈ బడ్జెట్‌ను చిదంబరం సాధనంగా వినియోగించారు.

ఆర్థికాభివృద్ధికి అరకొర చర్యలు


ఆర్థికాభివృద్ధి రేటు ఒకనాడు 9 శాతానికి చేరింది. ఇప్పుడు 5.4 శాతానికి పడిపోయింది. దీనిని 8 శాతానికి పెంచడం లక్ష్యంగా ఒక సవాలుగా ఆర్థిక మంత్రి వర్ణించారు. కాని  దీనికి తీసుకున్న చర్యలు అంతంతమాత్రంగానే వున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో కొంతమేర రోడ్లకు సంబంధించిన కేటాయింపులు తప్పిస్తే కొత్త చొరవలు అంతగా లేవు. చిన్న పరిశ్రమలకు కొన్ని  రాయితీలు ప్రకటించారు. రెండు పోర్టులను ఏర్పాటు, రెండు మూడు పారిశ్రామిక కారిడార్లు పని ప్రారంభం వంటి కొన్ని చర్యలున్నాయి.

కీలకమైన విద్యుత్‌, బొగ్గు కొరతల సమస్యల్ని పరిష్కరించకపోతే ఈ 5 శాతం వృద్ధిరేటు కూడా నిలబడే అవకాశం లేదు. విద్యుత్‌ కొరత మన ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది.  రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీల సంస్కరణల ప్రస్తావన తప్ప విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చే విధంగా గ్యాస్‌, బొగ్గు అందించే ఏర్పాటుకు తక్షణ చొరవలు  ఈ బడ్జెట్‌లో లేవు. మనదేశంలో విస్తరమైన బొగ్గు నిక్షేపాలున్నా, తవ్వి తీసుకోడానికి తగిన పారదర్శకమైన ఏర్పాట్లు చెయ్యడంలో ప్రభుత్వం ఇప్పటికే విఫలం  అయింది. ఆయిల్‌ దిగుమతులతోపాటు విదేశీమారక ద్రవ్యాన్ని కొల్లగొట్టేదిగా బొగ్గు కూడా తయారైంది. బొగ్గు, గ్యాస్‌ పై విధాన నిర్ణయాలకు వేచి వుంటేది గానే బడ్జెట్‌ ప్రసంగం సాగింది. 

వ్యవసాయరంగానికి 27,049 కోట్లు కేటాయించినా, కీలకమైన వ్యవసాయ మార్కెట్ల విస్తరణకి, స్టోరేజీ సౌకర్యాలకు అదనపు విలువ సమకూర్చే స్థానిక పరిశ్రమలకు, దళారీవ్యవస్థ రద్దుకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. గ్రామ పంచాయతీలలో గోడౌన్‌ల నిర్మాణానికే పరిమితం చేశారు. పామాయిల్‌ దిగుమతి సుంకాలపై రైతు వ్యతిరేక విధానాలను సవరించలేదు. కేవలం బడ్జెట్‌కి సంబంధంలేని బ్యాంక్‌ రుణాలను 5 లక్షల కోట్ల నుండి 7 లక్షల కోట్లకు పెంచారు.

ఇక విద్యారంగానికి కేటాయింపులు పెంచారు. మానవ వనరుల అభివృద్ధి శాఖకు 86,000 కోట్లు కేటాయించారు. కాని విద్యాప్రమాణాల మీద ఎలాంటి దృష్టి పెట్టలేదు. హైస్కూలు విద్యమీద, పాఠశాల విద్య మీద అంతర్జాతీయ, జాతీయ సర్వేల నివేదికలు దయనీయమైన స్థితిలో వున్నా విద్యాస్థాయిని ప్రతి ఏటా  వెల్లడిస్తున్నాయి. అయినా మంచి ప్రమాణాల బోధన, దానికి తగ్గ పరీక్షలు, పాఠశాలల అజమాయిషీ, విద్యా హక్కు చట్టం అమలుకు చర్యలు వంటి అంశాలు విస్మరణకు గురయ్యాయి. అందరికీ విద్య అంటేనే సరిపోదు. అందరికీ  మంచి ప్రమాణాల విద్య, డబ్బుతో,  పుట్టుకతో నిమిత్తం లేకుండా అందించే ఏర్పాట్లు జరగకపోతే సమీకృత అభివృద్ధి అన్న మిధ్యే అవుతుంది. పేదరిక నిర్మూలనకు  వేలకొట్లు ఖర్చు చేస్తున్నా, స్వతంత్ర జీవనానికి, ఎదిగే అవకాశాలకు వీలు కలిగించే విద్యాహక్కు అందించకపోతే పేదరికం శాశ్వతం అవుతుంది. ఎదిగే అవకాశం మృగ్యం అవుతుంది.

అందరికీ ఆరోగ్యం పేరుతో జాతీయ ఆరోగ్యమిషన్‌ కార్యకలాపాలను పట్టణాలకు కూడా విస్త్తరింపచేశారు. ఈసారి వైద్య - ఆరోగ్య రంగాలకు కొంత కేటాయింపులు పెంచారు. ఇక్కడా అదే సమస్య. మంచి ప్రమాణాల వైద్యసేవలు ప్రజలకు అందడం లేదు.  దీనికి ఈ బడ్జెట్‌లో కూడా ఎలాంటి ప్రాధాన్యతా లభించలేదు.

 గ్రామీణాభివృద్ధికి కార్యకలాపాలకు 80,194 కోట్లు కేటాయింపులు చేశారు.  ప్రజలు నివసించే చోట వారికి శుద్ధి చేసిన మంచినీరు ఈగలు, దోమలు లేని పారిశుద్ధ్యం, రోడ్లు, గృహవసతి కల్పనకు వీటిని ఉద్దేశించారు. కాని పంచాయితీలకు, మున్సిపాలిటీలకు అధికారాలు, సిబ్బంది బదిలీ కాకుండా నేరుగా వాటికి నిధులు కేటాయింపులు జరపకుండా ఢిల్లీలో వేస్తే సడక్‌యోజనలు, ఆవాసయోజనలు, శానిటేషన్‌ పధకాలు ఆశించిన ఫలితాలనివ్వవు.

మొత్తంమీద ఈ బడ్జెట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రయత్నంగా కనిపిస్తున్నది. ఆర్థికాభివృద్ధి గురించి కొన్ని ప్రస్తావనలున్నా ఆర్థిక సంస్కరణలు సాహసోపేతమైన నిర్ణయాలకు ఈ బడ్జెట్‌ దూరంగా వుంది. విధానాల ప్రస్తావనే గాని ఆచరణ పదును లేని బడ్జెట్‌గా వుంది.

    మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్యసేవలకు ఈ బడ్జెట్‌ భరోసా ఇవ్వలేకపోయింది. ప్రజలు జీవించే చోట్ల మౌలిక వసతుల కల్పనకు భరోసా ఇవ్వలేకపోయింది. విద్యుత్‌, బొగ్గు రంగాల సంక్షోభాల పరిష్కారానికి  దారి చూపలేకపోయింది. ఈ బడ్జెట్‌ గతాన్ని నెమరువేసుకున్నదీ కాదు, వర్తమానాన్ని అర్థం చేసుకున్నదీకాదు. అందుకే భవిష్యత్తు అవసరాలకు తగిన చొరవలు చూపలేకపోయింది.



                                                    ***


ఆర్ధిక స్వేచ్ఛలో దిగజారిన భారత్‌ స్థానం

              ఆర్ధిక స్వేచ్ఛలో  దిగజారిన భారత్‌ స్థానం 

                                                                                                             - డి.వి.వి.యస్‌. వర్మ
                                                                                                            dvvsvarmablogspot.com          


ప్రపంచ దేశాలలో ఆర్ధిక స్వేచ్ఛ 2012 వార్షిక నివేదిక 2013 జనవరిలో విడుదలైంది. ప్రతి ఏటా హెరిటేజ్‌ ఫౌండేషన్‌ ఈ నివేదికను రూపొందిస్తున్నది. 177 దేశాల పట్టికలో మనది 119వ స్థానం - సాధించిన ర్యాంకు 111. మనదేశం ఈ ర్యాంకులలో అజర్‌బైజాన్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్‌, మాలి, నైజీరియా, పాకిస్తాన్‌, సియర్రా లియోన్‌, సిరియా, టాంజానియాల గుంపులో వుంది. బంగ్లాదేశ్‌ 109, నేపాల్‌ 110 స్థానాల్లో వుంటే భారతదేశం, పాకిస్థాన్‌లు 111వ ర్యాంకును పంచుకున్నాయి.  ఘనా, బోట్స్‌వానా, కాంబోడియా, కజాక్‌స్థాన్‌, ఎల్‌సాల్వడోర్‌లు మనకంటే 40 స్థానాలకు ముందున్నాయి. అయితే ఇథియోపియా, అంగోలా, మయన్మార్‌, బురుండి దేశాలు మనకంటే కొంత దిగువన వుండి  మనకి ఊరట కలిగిస్తున్నాయి.

మొదటి ఐదు స్థానాలను హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌, న్యూజిలాండ్‌ స్విట్జర్‌లాంట్‌, అస్ట్రేలియా, కెనడాలు పొందాయి. ఈ చివరి రెండు దేశాలు ఒకే స్థాయిలో 5వ రాంకు పొందాయి.

ఈ ఆర్థిక స్వేచ్ఛ ర్యాంకులకు దేశాల అభివృద్ధికి మధ్య ఒక సంబంధం వుంది. అదీ మనం గమనించాల్సిన విషయం. సామాజిక రాజకీయ, ఆర్ధికపరమైన ఉన్నతికీ, మెరుగైన వ్యక్తిగత జీవనానికీ ఈ ఆర్ధిక స్వేచ్ఛకీ మధ్య విడదీయరాని అనుబంధం వుంది. ఆర్ధికస్వేచ్ఛ హెచ్చుగా వున్న దేశాలు అది లేని దేశాల కంటే మంచి జీవనంలో  ఉచ్ఛస్థితి లో వుంటున్నాయి.                                     

మొదటి ర్యాంకులు పొందిన నాలుగోవంతు దేశాల సరాసరి స్థూల జాతీయోత్పత్తి చివరి ర్యాంకులు సాధించిన నాలుగోవంతు దేశాల కంటే దాదాపు 7 రెట్లు అధికంగా వుంది.

అలాగే ఈ మొదటి స్థానాల దేశాలలో అత్యంత పేదల సంపాదన చివరి స్థానాలు పొందిన దేశాల కంటే 10 రెట్లు ఎక్కువగా వుంది. అలాగే మొదటి దేశాలలో సగటు జీవితకాలం 79.5 సంవత్సరాలుంటే చివరి స్థానాల దేశాలలో 61.6 శాతం మాత్రమే వుంది. అలాగే రాజకీయ స్వేచ్ఛ, పౌరహక్కుల స్థితిలో కూడా చాలా వ్యత్యాసం వుంది.

మొత్తంమీద రెండు దశాబ్దాలుగా సాగిన ఈ అధ్యయనాలు ఎక్కడ ఆర్ధిక స్వేచ్ఛ ఎక్కువగా వుంటే అక్కడ ఆర్ధిక వ్యవస్థలో పెట్టుబడుల రేటు హెచ్చుగా, ఆర్ధిక ప్రగతి రేటు హెచ్చుగా వుందని స్పష్టం చేస్తున్నాయి. పెరుగుతున్న ఆదాయాలు, తరుగుతున్న పేదరికం కనిపిస్తున్నది. అలాగే ఆర్ధిక స్వేచ్ఛ వున్న దేశాలలో ఆర్ధిక, రాజకీయ, న్యాయవ్యవస్థలు ఆ దేశాల తలసరి ఆదాయాలను పెంచడంలో, ఆర్ధికాభివృద్ధిని సాధించడంలో ముందున్నాయి.

ఆర్థిక స్వేచ్ఛ నివేదిక రూపొందించడానికి 5 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వాటి ఆధారంగా అభివృద్ధి పట్టికను రూపొందించారు. 1) ప్రభుత్వ వ్యయాల సైజు 2) న్యాయ వ్యవస్థ, ఆస్థిహక్కుకు గల భద్రత 3) నికర డబ్బు    4) అంతర్జాతీయ వాణిజ్యానికి గల స్వేచ్ఛ  5) చట్టాలు. ఈ ఐదు అంశాలలో 24 భాగాలుంటాయి.  అందులో మరిన్ని   ఉప భాగాలుంటాయి.  మొత్తంమీద 42 అంశాలు ఈ పట్టికకు ప్రాతిపదికగా వుంటాయి. అలాగే ప్రతి అంశాన్ని 0-10 స్కేలు మీద వాటి  స్థితిని గుర్తించి అంతిమ పట్టికను రూపొందిస్తారు.

అందుచేత సాధ్యమైనంత శాస్త్రీయ ప్రమాణాలతో ఈ నివేదికలు రూపొందిస్తున్నారని భావించాలి. అలాగే దీనికి అవసరమైన గణాంక వివరాలను ఆయా దేశాల నుండి కాకుండా అంతర్జాతీయ సంస్థల నుండి సేకరించారు. వీటి ఆధారంగా వచ్చిన పాయింట్లు ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. హంగ్‌కాంగ్‌ 89.3 పాయింట్లతో అగ్రస్థానంలో వుండగా 88.0 పాయింట్లతో సింగపూర్‌ ద్వితీయ స్థానంలోనూ తర్వాత అస్ట్రేలియా, న్యూజిలాండ్‌, స్విట్జర్లాండ్‌లు ఉన్నాయి.

భారతదేశంలో 55.2 పాయింట్లతో 119వ స్థానంలో వుండి 111వ ర్యాంకును మాత్రమే పొందింది. గత సంవత్సరంతో పోల్చినపుడు 0.6 పాయింట్లు పెరిగాయి. ఈ  పెరుగుదల పబ్లిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ మరియు మోనిటరీ స్వేచ్ఛల మెరుగుదల వల్ల సాధ్యమైంది. అయితే ఇక్కడ సాధించిన పాయింట్లను దేశంలో పెరిగిన అవినీతి కబళించింది. దీనికి తోడు వ్యవస్థాగతమైన లోటుపాట్లు దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది. సమర్ధవంతంగా పనిచేసే న్యాయ, చట్ట వ్యవస్థల లోటు, ఆర్ధిక వ్యవస్థ అంతటా వ్యాపించిన అవినీతి వల్ల క్రియాశీలకంగా వ్యవహరించే ప్రయివేటురంగం మందగమనంలో పడింది. అనేక రంగాలలో ప్రభుత్వ ఆధిపత్యం, దుబారాతో కూడిన సబ్సిడీ వ్యవస్థలతో బడ్జెట్‌లోటు పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది.

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఆటుపోట్లుతో సాగుతున్నాయి. కీలకమైన సేవారంగాల సరళీకరణ ఆగిపోయింది. అయితే కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2012లో ఎఫ్‌డిఐలను ప్రోత్సహించడం ప్రభుత్వ సబ్సీడీలను తగ్గించడం ప్రారంభమైంది.  మొత్తంమీద ఆర్థిక స్వేచ్ఛకు సంబంధించిన ఐదు రంగాలలోని 10 విభాగాలలో 1) ఆస్థి హక్కులకు సంబంధించిన స్వేచ్ఛకు 50.00 పాయింట్లు రాగా 2) అవినీతి నుండి స్వేచ్ఛకు అత్యల్పంగా 31.0 పాయింట్లు 3) ప్రభుత్వ వ్యయంలో ప్రమాణాలకు 77.9 పాయింట్లు  4) ద్రవ్యస్వేచ్ఛకు 78.3 పాయింట్లు 5) వ్యాపారస్వేచ్ఛకు 37.3 పాయింట్లు 6) కార్మిక స్వేచ్ఛకు 73.6 పాయింట్లు 7) మోనిటరీ స్వేచ్ఛకు 65.3 పాయింట్లు 8) వాణిజ్య స్వేచ్ఛకు 63.6  9) పెట్టుబడుల స్వేచ్ఛకు 35.0  10) ఫైనాన్షియల్‌ స్వేచ్ఛకు 40.0 పాయింట్లు పొందినట్లు ప్రకటించింది.

మొత్తంమీద భారతదేశంలో చట్టబద్ధపాలన ఒకే తీరున లేదు. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని వ్యవస్థీకృతం చెయ్యడంలో బలహీనతలున్నాయి. న్యాయప్రక్రియ దీర్ఘకాలం తీసుకునేదిగాను, వ్యయంతో కూడుకున్నదిగాను, రాజకీయ ఒత్తిళ్లకు గురయ్యేదిగానూ వుంది. ఆస్థిహక్కుకు సమర్ధవంతమైన భద్రత కల్పించకపోవడం, మేధోహక్కుల పరిరక్షణలో చాలా లోట్లు వున్నాయి. అలాగే అవినీతి ఆరోపణల విచారణకు   ఉద్దేశించిన స్వతంత్ర ప్రతిపత్తి గల అంబుడ్స్‌మన్‌ ఏర్పాటుకు పార్లమెంటు ఆమోదం లభించలేదని పేర్కొంది.

ప్రభుత్వ ఆదాయ వ్యయాల మీద అంచనా వేస్తూ మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో 7.4 శాతం మాత్రమే ఆదాయ పన్నుగా వుంది. ప్రభుత్వ ఖర్చు మాత్రం 27.1 శాతం కావడంతో బడ్జెట్‌ లోటు తప్పడం లేదు.  జి.డి.పి.లో 67.1 శాతం అప్పులభారం వుందని పేర్కొంది.

అలాగే దేశంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి, ఉత్పత్తి సాగించడానికి వ్యయప్రయాసలతో కూడిన పద్ధతులున్నాయి. ఒక వ్యాపారం ప్రారంభించామంటే  సగటున కనీసం 25 రోజులు పడుతుంది. లైసెన్సు పొందడానికి చాలా ఖర్చు వుంటుంది.

అభివృద్ధి చెందని శ్రామిక మార్కెట్‌ వల్ల నిపుణత వుండడం లేదు. ఉపాధిరంగం ప్రధానంగా అసంఘటిత కార్మికులతోనే వుంది. అలాగే ప్రభుత్వం రకరకాల వస్తువుల మీద ధరల నియంత్రణ చేస్తున్నది. ఇవన్నీ  ఆర్థిక స్థిరత్వాన్ని బలహీనం చేస్తున్నాయి.

ఇక వ్యాపారంలో సుంకాలు 8.2 శాతంగా భారంగా వున్నాయి. దీనికితోడు సుంకాలతో నిమిత్తం లేని అడ్డంకులు వున్నాయి. భారతదేశ బ్యూరోక్రసీ కొత్త పెట్టుబడులకు అననుకూల వాతావరణాన్ని కల్పించేదిగా వుంది. తక్కువ ధరలకు ప్రజలకు సరుకులు అందించే బహుళజాతి చిల్లర వర్తకాన్ని అనుమతించడంలో జాప్యం, ప్రభుత్వరంగ సంస్థల ఆధిక్యం వంటివి కొనసాగుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది.

మొత్తంమీద ఆర్థిక స్వేచ్ఛకు, అవినీతి నిరోధకానికి తగిన చర్యలు అరకొర కావడం వల్లనే భారతదేశం అభివృద్ధి వేగం మందగించిందనేది దీని సారాంశం.

మన రాష్ట్రాలు : ఆర్ధిక స్వేచ్ఛ

భారతదేశంలో ప్రధానమైన 20 రాష్ట్రాలలో ఆర్ధిక స్వేచ్ఛ స్థితిపై మరో రిపోర్టు విడుదలైంది. 2009-2011 గణాంకాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ఆయా రాష్ట్రాలకు ర్యాంకులను ప్రకటించింది. ఇందులో గుజరాత్‌ రాష్ట్రం మొదటిస్థానాన్ని పొందగా చివరగా బీహార్‌ వుంది. 2005లో 5వ స్థానంలో వున్న గుజరాత్‌ మొదటి స్థానాన్ని అందుకోగా బీహారు స్థానం అక్కడే వుండిపోయింది. అయితే బీహారు తన స్కోరు పాయింట్లను మాత్రం పెంచుకుంది.

జర్మనీకి చెందిన ఫ్రెడరిచ్‌ న్యూమాన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆర్థికవేత్తలు వివేక్‌ డెబ్రాయ్‌, లవీఫ్‌ భండారీలు ఈ రిపోర్టును రూపొందించారు. ప్రపంచదేశాల ఆర్థిక స్వేచ్ఛ కొలమానాలనే వీరు ఉపయోగించారు. స్వేచ్ఛ మార్కెట్‌ను సమర్ధించే కాంటో ఇన్‌స్టిట్యూట్‌ ఈ నివేదిక రూపకల్పనలో భాగస్వామిగా వుంది.

2005, 2009 సంవత్సరాలలో ఆర్థిక స్వేచ్ఛలో మొదటి స్థానంలో వున్న తమిళనాడు రెండోస్థానం పొందింది. అలాగే 6వ స్థానంలో వున్న మధ్యప్రదేశ్‌ మూడవ స్థానానికి చేరింది.

అలాగే 2005లో 7వ స్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్‌ 2009లో 3వ స్థానాన్ని పొందినా 2011 నాటికి 6వ స్థానానికి దిగజారింది. హర్యానా రాష్ట్రం స్థిరంగా 4వ స్థానాన్ని 2005 నుండీ నిలబెట్టుకుంది.

ప్రపంచంలో భారతదేశం స్థానం దిగజారుతున్న రాష్ట్రాలలో పనితీరు అంతకంటే మెరుగుగా కనిపిస్తున్నది.

ఒకనాడు ఆర్థిక వ్యవస్థకు పవర్‌హౌస్‌గా వున్న పంజాబు ఇప్పుడు 12వ స్థానానికి పడిపోయింది. దీనికి ద్రవ్యలోటు, విచ్చలవిడిగా, జనాకర్షణ పధకాలు కారణంగా కనిపిస్తున్నాయి. మొత్తంమీద వివిధ రాష్ట్రాలలో అవినీతి పెరుగుదల, ప్రభుత్వాల వ్యయం,  న్యాయం, చట్టపరమైన అంశాల అమలు, వ్యాపార వాణిజ్య స్వేచ్ఛలను అంచనా కట్టడానికి ఈ నివేదికలు ఉపయోగపడేవిగా వున్నాయి.
 
                                                                                   ***


గ్రామీణ పాఠశాలల విద్యా స్థితిపై అసర్‌ నివేదిక
పెరుగుతున్న పిల్లల నమోదు తరుగుతున్న విద్యాప్రమాణాలు

                                                                                                                  - డి.వి.వి.యస్‌. వర్మ                                                                          
 2012 సంవత్సరం ముగిసింది. దేశంలో పాఠశాల విద్యపై అసర్‌ (యాన్యువల్‌ స్టేటస్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు) వార్షిక నివేదిక 2013 జనవరి 17న కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి డా.యం.పళ్లంరాజు చేతుల మీదుగా విడుదలైంది. ఈ నివేదికలో వెల్లడైన అంశాలు పాఠశాల విద్య గురించి అందరూ మాట్లాడుకుంటున్నవే అయినప్పటికీ వాటిని పదేపదే ఒక ప్రామాణికమైన వార్షిక సర్వే ద్వారా అసర్‌ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

మన పిల్లల చదువుకు పాఠశాల విద్య పునాది. ఈ చదువే మన సమాజంలో చాలా సమస్యలకు పరిష్కారం. మంచి ప్రమాణాల చదువు దేశాన్ని తిరుగులేని అభివృద్ధి క్రమంలో నడిపిస్తుంది. ప్రజలకు స్వతంత్ర జీవనాన్ని కల్పిస్తుంది. అంతకుమించి మన సమాజంలో అనేక వివక్షలున్నాయి. కులవివక్ష, లింగవివక్ష, పేదరికపు వివక్షలున్నాయి. చదువు ఈ అంతరాలను తొలగిస్తుంది. వారి సామాజిక హోదాను మారుస్తుంది. ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరిగే స్వతంత్ర జీవనాన్ని ఇస్తుంది.

మనకి ప్రభుత్వ లేదా ప్రయివేటు పాఠశాలలు ఇబ్బడి ముబ్బడిగా వున్నాయి. పిల్లల నమోదు శాతం గణనీయంగా పెరుగుతున్నది. ఏటా పిల్లలు తరగతులు దాటుతున్నారు. డిగ్రీలు, డిప్లమోలు పొందుతున్నారు. కాని పనికొచ్చే చదువు మాత్రం దక్కడం లేదు. పిల్లల శక్తి సామర్ధ్యాలను ఈ చదువు పెంచడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయి. ప్రయివేటు పాఠశాలలు నిత్యపరీక్షల పేరుతో రుబ్బుడు, దిద్దుడు తప్ప పిల్లలలో వివేచనాశక్తిని పెంచడం లేదు .

ఈ స్థితిని ఒక అసర్‌ నివేదికలే కాదు, భారతదేశంలో విద్యమీద జరిపిన సర్వేలన్నీ ఈ స్థితికి అద్దం పడుతున్నాయి. గత  సంవత్సరం వచ్చిన మూడు రిపోర్టులు దీనిని ధృవపరుస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి వహించిన ''పీసా'' సర్వేప్రకారం భారతదేశంలో 10వ తరగతి పిల్లల చదువు సామర్ధ్యం అత్యంత హీనస్థితిలో వున్నట్లు  వెల్లడించింది.  ఆ సంస్థ 74 దేశాలలో విద్యాస్థితిని అంచనా వేస్తే  భారత దేశం 73వ స్థానంలో అట్టడుగున నిలిచింది.  చైనా మొదటి స్థానంలో  వుండగా అమెరికా 16వ స్థానాన్ని పొందింది.  విద్యార్థుల మాతృభాషా పరిజ్ఞానాన్ని, లెక్కలలో సామర్థ్యాన్ని, వారి తర్క పుష్టిని ప్రమాణాలుగా తీసుకుని చేసిన సర్వేలో మన పిల్లల వెనకబాటుతనం స్పష్టమైంది.

అలాగే విప్రో ఇఎల్‌ చేసిన క్వాలిటీ ఎడ్యుకేషన్‌ స్టడీ ప్రకారం అగ్రస్థానంలో వున్న కొన్ని ప్రయివేటు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు 2006నాటి కంటే 2010లో చాల బలహీనపడ్డాయని తేల్చింది. అలాగే గత 2011 అసర్‌ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు నానాటికీ తీసికట్టు కావడాన్ని చూపించింది.

భారతదేశంలో ప్రధమ్‌ సంస్థ 2005 నుండి క్రమం తప్పకుండా వార్షిక విద్యాస్థితి నివేదికలను విడుదల  చేస్తున్నది. ఈ 2012 సర్వే 8వ వార్షిక నివేదిక. ఈ సర్వే 567 జిల్లాలలో 1600 గ్రామాలలో 3.3 లక్షల కుటుంబాలకు చెందిన  3-16 సంవత్సరాల పిల్లల చదువు స్థితి మీద నిర్వహించారు. 6 లక్షల మంది విద్యార్థుల చదువు సామర్ధ్యాన్ని  అంచనా కట్టారు. పనిలో పనిగా 2010 విద్యాహక్కు చట్టం వచ్చిన తర్వాత  ఆ చట్టం ప్రమాణాలు పాఠశాలలలో ఎలా వున్నాయో పరిశీలించడానికి 14,600 ప్రభుత్వ పాఠశాలల స్థితిని సేకరించారు. వీటన్నింటి ఫలితాలను క్రోడీకరించి 2012 అసర్‌ నివేదికగా వెల్లడించారు.


గ్రామీణ భారతంలో విద్యాస్థితి

పాఠశాలలో 6-14 వయసు గల పిల్లల నమోదు హెచ్చుస్థాయిలోనే 96.5 శాతంగా వుంటున్నది. పాఠశాలలో నమోదు కాని వారి సంఖ్య 3.3 నుండి 3.5 శాతం మధ్య వుంటున్నది. పోతే 11-14 సంవత్సరాల వయస్సు గల బాలికలు పాఠశాలలకు దూరం కావడం పెరుగుతున్నది.  ఇందులో రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లు 11 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి.

ప్రయివేటు మోజు

అన్ని రాష్ట్రాలలో 2006లో ప్రయివేటు పాఠశాలలో 18.7 శాతం  బాలబాలికలు వుంటే 2012లో ప్రైయివేటు పాఠశాలలో పిల్లల వాటా 28.3 శాతానికి పెరిగింది. అత్యధికంగా కేరళ, మణిపూర్‌లలో 60 శాతం మంది, జమ్ము-కాశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గోవా, మేఘాలయాలలో 40 శాతం మంది బాలబాలికలు ప్రయివేటు పాఠశాలల్లోనే వున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా జాతీయ సరాసరిని మించి 36.5 శాతం మంది ప్రయివేటు పాఠశాలల్లోనే వున్నారు.

మొత్తంమీద ప్రయివేటు పాఠశాలలో పిల్లల నమోదు సంఖ్య ప్రతిఏటా 10 శాతం చొప్పున పెరుగుతున్నది. ఇలాగే కొనసాగితే 2018 నాటికి ప్రయివేటు పాఠశాలల్లో పిల్లల నమోదు 50 శాతానికి మించుతుందని ఈ నివేదిక అంచనావేసింది.


చదువు ఎలా వుంది

దేశవ్యాప్తంగా 2010లో 46.3 శాతం 5వ తరగతి పిల్లలు 2వ తరగతి స్థాయి పుస్తకాన్ని చదవలేకపోయారు. అలాగే 2011లో ఇది 51.8 శాతానికి, 2012లో 53.2 శాతానికి చదవలేని వారి సంఖ్య పెరిగింది. చదవలేని వారు ప్రభుత్వ పాఠశాలల్లో కొంచెం ఎక్కువగా ఉన్నారు. 2010లో 49.3 శాతం, 2011లో 56.2 శాతం, 2012లో 58.3 శాతం అంటే చదవలేని పిల్లల సంఖ్య పెరుగుతున్నది.

2010లో 5తరగతి చదువుతున్న పిల్లలలో 29.1 శాతం 2 సంఖ్యల తీసివేతల్ని  చేయలేకపోయారు. అది 2011 కల్లా 39 శాతానికి చేరి, 2012 కల్లా 46.5 శాతానికి చేరుకుంది.

5వ తరగతి చదువుతున్న పిల్లలలో 2010లో 63.8  2011లో 72.4 , 2012లో 75.2 శాతం మంది పిల్లలు చిన్న చిన్న భాగాహారాలు కూడా చేయలేకపోతున్నారు. 

2012 అసర్‌ సర్వేలో తేలిక ఇంగ్లీషు పదాలు, వాక్యాల చదువు సామర్థ్యాన్ని కూడా పరీక్షించారు. గ్రామీణ భారతంలో  5వ తరగతి చదువుతున్న పిల్లలలో 51.1 శాతం మంది   ఇంగ్లీషు పదాలు చదవలేకపోతున్నారు.

5వ తరగతి పిల్లలు ఇంగ్లీషులో సామాన్య వాక్యాలను 77.5 శాతం మంది చదవలేకపోతున్నారు. అలాగే ఏడవ తరగతి పిల్లలలో 53 శాతం మంది ఇంగ్లీషు వాక్యాలను చదవలేక పోతున్నారు.


ట్యూషన్లకు ఎంతమంది వెళుతున్నారు....

ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో కలిపి 1 నుండి 8వ తరగతి వరకు మొత్తం నమోదయిన పిల్లలలో  4వ వంతు పిల్లలు ప్రైవేటు ట్యూషన్లకు వెళుతున్నారు.

2012లో ప్రభుత్వ పాఠశాలలలో 5వ తరగతి  చదువుతూ ట్యూషన్లకు వెళ్ళని వారు 54.5 శాతం.  ట్యూషన్లకు వెళ్ళేవారు 18.8 శాతం వున్నారు.

టూషన్లకు వెళుతున్నవారి సామర్థ్యాలు, వెళ్ళని వారి కంటే పెరుగుతున్నాయన్నది ఈ సర్వేలో తేలింది.

గత రెండేళ్లలో ట్యూషన్‌కు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థు సంఖ్య తగ్గింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే ఐదో తరగతి విద్యార్థులు 2011లో 13% మంది ట్యూషన్లకు వెళ్లగా.... 2012లో అది 7.7 శాతానికి తగ్గింది.


ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే స్థితి


రాష్ట్రంలో 6-14 ఏళ్ల పిల్లల్లో 97.4% మంది బడుల్లో చేరారు. 2007 సంవత్సరంతో పోలిస్తే ఇది 1.6% పెరిగింది.

11-14 ఏళ్ల పిల్లల్లో 5.1% మంది ఇప్పటికీ బడులకు వెళ్లటం లేదు. దేశవ్యాప్తంగా వీరి శాతం మరింత ఎక్కువగా కనిపిస్తోంది.

మూడో తరగతి విద్యార్థుల్లో 48.7% మంది మాత్రమే ఒకటో తరగతి పాఠ్యపుస్తకాలను చదవగలుగుతున్నారు.

ఐదో తరగతి విద్యార్థుల్లో 59.4% మంది మాత్రమే రెండో తరగతి పాఠ్యపుస్తకాలను చదవగలుగుతున్నారు.

ఐదో తరగతి చదివేవారిలో 40% మంది ప్రాథమిక పఠన నైపుణ్యాలు  వుండటం లేదు. మూడో తరగతి పిల్లల్లో సగం మంది మాత్రమే రెండంకెల తీసివేత లెక్కలను చేయగలుగుతున్నారు. ఇక ఐదో తరగతి విద్యార్థుల్లో 41.1% మందికే భాగహారం లెక్కలు చేయటం తెలుసు. అంటే 59% మంది విద్యార్థులు కనీస గణితస్థాయిలను అందుకోకుండానే ప్రాథమిక పాఠశాల చదువు పూర్తిచేస్తున్నారు.

మూడో తరగతి చదివేవారిలో 61.4% మంది పిల్లలు ఆంగ్లలో సరళ పదాలను చదవగలుగుతున్నారు. మిగిలిన వారిలో కొందరు  అక్షరాలను మాత్రమే గుర్తించగలుగుతున్నారు. 65.5% విద్యార్థులు మాత్రమే పదాల అర్థాలను ఆంగ్లంలో చెబుతున్నారు.

మొత్తంమీద  పాఠశాల విద్యాస్థితి దారుణంగా వుందనేది ఈ రిపోర్టు సారాంశం. ఇక సమస్యల వర్ణనవల్ల అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ వుండదు. ఈ స్థితిని మార్చడం ఎలా అన్నదే అసలు ప్రశ్న.

పాఠశాల విద్యలో అరకొర మార్పులు పరిస్థితిని చక్కదిద్దలేవు. ఒక ప్రణాళికతో సమగ్రమైన ప్రక్షాళనకు పూనుకోవాలి. సిలబస్‌ మారాలి, పుస్తకాలు మారాలి, బోధన మారాలి. మాతృభాషలో బోధన, ఇంగ్లీషు నేర్పించడాన్ని మేళవించాలి. విద్యార్థుల స్థాయిని అంచనా కట్టడానికి ఏదో ఒక తరహా పరీక్షలుండాలి. ఉపాధ్యాయులలో జవాబుదారీతనం పెంచడానికి  అజమాయిషీని పటిష్టం చెయ్యడానికి తగిన ప్రోత్సాహకాల పద్ధతుల్ని ప్రవేశపెట్టాలి. ప్రభుత్వ, ప్రయివేటు తేడా లేకుండా  అందరికీ మంచి ప్రమాణాల విద్య అందాలి. దీనికి ప్రభుత్వాలు చొరవ చూపాలి. మన రాజకీయానికి ఓట్ల ధ్యాస వుందే తప్ప మార్పు యోచన లేదు. డబ్బుతో, కులంతో, పేదరికంతో నిమిత్తం లేకుండా అందరికీ మంచి ప్రమాణాల విద్యను అందించడం.  లక్ష్యంగా విధానపరమైన రాజకీయ చర్చ జరిగితేనే తప్ప పిల్లల చదువుకు భవిష్యతు వుండదు. 
 
                                                                          ***