ఇందిరమ్మ బాట ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తుందా?

  ఇందిరమ్మబాట ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తుందా? 

                                                                                                       - డి.వి.వి.యస్‌. వర్మ

 

ఉప ఎన్నికలలో పరాజయం పాలైన తర్వాత నేరుగా జనంలోకి వెళ్లాలన్న తలంపుతో ఇందిరమ్మ బాటకు ముఖ్యమంత్రి రూపకల్పన చేశారు. తొలివిడతగా తూర్పు గోదావరి జిల్లాలో స్వయంగా  ముఖ్యమంత్రే ఈ కొత్తబాటకు శ్రీకారం  చుట్టారు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్లుగా ఇందిరమ్మ బాట ఫలితాలను విశ్లేషించుకోడానికి తూర్పుగోదావరి పర్యటన సరిపోతుంది. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించి మెరుగైన పాలన అందించేందుకే ఇందిరమ్మబాట ప్రారంభించినట్టు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడం ఈ బాట ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పధకాలను ప్రభుత్వ పధకాలుగా ప్రజలు భావించకపోవడం వల్లే వారి అభిమానాన్ని ఎన్నికల్లో చూరగొనలేకపోయామని అందుకోసమే ఈ పర్యటనగా ప్రకటించుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా ఏజన్సీలో ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్ధులతో సంభాషణలు చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. రాత్రి అక్కడే బసచేశారు. నిజానికి ఆశ్రమ పాఠశాలల్లో వసతి గృహాల స్థితి అధ్వాన్నంగా వుంది. టాయిలెట్లు, స్నానాల గదుల స్థితి, నేలమీద పిల్లల పడకల స్థితి, అక్కడ పెట్టే భోజనం నాణ్యత ఎంత దారుణంగా వున్నాయో నిజంగా ముఖ్యమంత్రి తెలుసుకోవాలంటే  ఆయన కూడా అవే టాయిలెెట్లను, స్నానాల గదులను, నేలమీద పడకను స్వయంగా అనుభవించి వుంటే తమ పధకాలు ఎలా వున్నాయో అర్థం అయ్యేవి. అంతేకాని పిల్లలతో ముఖ్యమంత్రి భోజనానికి ప్రత్యేక విందు ఏర్పాట్లు, ఆయన నిద్రించటానికి ప్రత్యేక ఎ.సి. గది ఏర్పాటు చేయించుకుంటే క్షేత్రస్థాయి సమస్యలు ఎలా అనుభవంలోకి వస్తాయి? అలాగే ఉపాధి హామీ కూలీలతో సహపంక్తి భోజనం తంతు సాగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో మహిళా శాసనసభ్యులు వడ్డిస్తుండగా ముఖ్యమంత్రి విందు  ఆరగించారు. అందుకే ముఖ్యమంత్రులు, మంత్రులు ఎన్నిసార్లు పర్యటనలు చేస్తున్నా క్షేత్రస్థాయి వాస్తవాలు స్వానుభవంలోకి రాకుండా పోతున్నట్లు కనిపిస్తున్నది. 

 గతంలో యన్‌.టి.రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఇలాంటి పర్యటనలే చేశారు. ఆయన కోసం ప్రత్యేక వంటకాలు, ఒక ఎ.సి. కుటీరం వగైరాలతో సాగించారు. ఇలాంటి పర్యటనలు నేతల్ని ప్రజలతో మమేకం చెయ్యకపోగా ఇది ఒక ప్రచార తంతుగానే మిగిలిపోతున్నది.  

ఇక రెండోది  ఇందిరమ్మబాట తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోడానికి కాదని ప్రకటించుకున్నా జరిగిన తీరు ఆ ప్రకటనను అపహాస్యం చేసేదిగా సాగింది. ప్రభుత్వ పధకాలన్నీ వై.యస్‌. పేరుమీద సాగినందువల్ల నష్టం జరిగిందని భావించిన సర్కారు ఇప్పటి ప్రచారంలో మళ్లీ అదే బాట పట్టింది. ప్రభుత్వం ముద్రించిన ఇందిరమ్మబాట లోగోలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఫొటో పెట్టడం, 108 వాహనంపై రాజీవ్‌గాంధీ ఫొటోతోపాటు ముఖ్యమంత్రి ఫొటోను ముద్రించడం, రేషన్‌ షాపుల దగ్గర ఇలాంటి పోస్టర్లే దర్శనమిచ్చినట్లు వార్తలొచ్చాయి. ఇది రాజశేఖర రెడ్డి  నడిచినబాటే తప్ప ప్రభుత్వ పధకాలుగా ప్రచారం చేసే రూటు కాదని స్పష్టం అవుతున్నది.

ఇక ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం అంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాటలో కొంత మాట మార్చారు. వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని, పని జరగకపోతే ఒక కార్డుముక్క రాసి పడెయ్యమని సూచించారు. కోనసీమ రైతుల సమస్యలపై ఇలాంటి అనునయం కూడా ప్రదర్శించకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ బాట పేరుతో ముఖ్యమంత్రి ప్రజల దగ్గరకు వెళ్ళారు. సమస్యలు విన్నారు. పరిష్కారాలను వాయిదా వేశారు. సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మిగిలాయి.

ప్రభుత్వ పధకాల అమలు తీరు, వివిధ స్థాయిలలో ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి, మంత్రులకు, శాసన సభ్యులకు తెలియని అంశాలు  కావు. ఎందుకంటే ఈ సమస్యలు హఠాత్తుగా ఈ రోజునే పుట్టుకొచ్చినవి అంతుచిక్కనివి కావు. ప్రభుత్వాలకి ముందుచూపు లేకపోవడం, పరిష్కారమార్గాలు తెలియకపోవడం అసలు సమస్యగా కనిపిస్తున్నది. ఉదాహరణకి ప్రతి సంవత్సరం జూన్‌ నెలలో పాఠశాలలు తెరుస్తారని అందరికీ తెలుసు. సుమారుగా ఎంతమంది పిల్లలున్నదీ తెలుసు అయినా పాఠశాలలు తెరిచేనాటికి పుస్తకాలు వుండవు, యూనిఫాంలు వుండవు. జూన్‌ నెలలో వర్షాలు పడతాయని అందరికీ  తెలుసు. రైతులకు అదే అదను అని తెలుసు. అయినా విత్తనాలు వుండవు. వున్నా అందవు. అందుచేత ఇంత నిర్దిష్టంగా తెలిసిన సమస్యలకే ప్రభుత్వాల దగ్గర పరిష్కారాలు వుండడం లేదంటే అది పాలనలోని అసమర్ధతకి అద్దం పడుతున్నది.

బాటలు ఎన్నికల్లో గట్టెక్కిస్తాయా?

 
రాష్ట్రంలో గత 15-16 సంవత్సరాలుగా అందరు ముఖ్యమంత్రులు తలోబాట చేపట్టిన వారే, యన్‌.టి.ఆర్‌. ముఖ్యమంత్రిగా ప్రజల వద్దకు పాలన పేరుతో తనదైన బాటను ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా జన్మభూమితో సహా పలు బాటలు ఎడతెరిపి లేకుండా నిర్వహించారు. రాజశేఖర్‌ రెడ్డి రచ్చబండలు, పల్లెబాటలు సాగించారు. ఇప్పుడు కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇందిరబాట పట్టారు. ఈ బాటలన్నీ ప్రజల కోసం చేపట్టినట్టు, ఎక్కడి సమస్యలకు అక్కడ పరిష్కారం కోసం ఉద్దేశించినట్లు ప్రకటించినవే. కాని ఈ బాటల వెనక వున్న లక్ష్యం వేరు. ప్రజల దృష్టిలో తామే సమస్యలు పరిష్కరించే హీరోలు కావాలని, అది తమ నాయకత్వాన్ని స్థిరపరుస్తుందని, తమ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తుందనీ వీరందరి విశ్వాసంగా కనిపిస్తుంది. అయితే ప్రజలకు కావాల్సింది బాటలు కాదు. వారికి చేతలు కావాలి. వారికి ఎక్కడి సమస్యలు అక్కడ తక్షణం పరిష్కారం కావడం ముఖ్యం. అందుకే ఏడాదికోసారి ప్రభుత్వాలు చేసే ఈ బాటల కోసం నిరీక్షించి వీరి రాకకోసం ఎదురుచూడరు. అయినా ఆశ చావక ఇలాంటి బాటలు వచ్చినప్పుడు ప్రజలు వినతి పత్రాలు ఇస్తూనే వుంటారు. వాగ్దానాలే తప్ప పరిష్కారాలు కావడం లేదని ప్రజలకు తెలుసు. 
 

సుపరిపాలనా సూత్రాలు :

 
 ఎందరు ముఖ్యమంత్రులు మారుతున్నా, ఎన్ని బాటలు నిర్వహిస్తున్నా, అందరూ సుపరిపాలనా సూత్రాలను విస్మరిస్తూ వచ్చారు. అందుకే సమస్యలు పేరుకుపోతున్నాయి. ప్రజలలో పాలనపట్ల తీవ్రమైన అసంతృప్తి పెచ్చరిల్లుతున్నది.

మొదటిది: ప్రతిబాటలోనూ ప్రజలు లక్షలాదిగా వినతి పత్రాలు సమర్పిస్తున్నారంటే ప్రభుత్వ పాలనాయంత్రాంగం పనిచేయడంలేదని అర్థం. దాని అసమర్థతకు, అవినీతికి ఇది దర్పణం.  పరిపాలనలో జవాబుదారీతనం పూర్తిగా లోపించినట్లు లెక్క. దీనికి కేవలం పాలనాయంత్రాంగాన్ని నిందించి ప్రయోజనం లేదు. ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోడానికి వీలుగా బాధ్యతల్ని, అధికారాలని నిర్దిష్టంగా వారికి దఖలు పర్చకపోవడం ప్రధాన కారణం. అందుకే సమస్యల్ని పైపైకి తోసెయ్యడం తప్ప ఎక్కడికక్కడ పరిష్కరించడం వారికి తప్పనిసరి బాధ్యత కావడం లేదు. అందుచేతనే జిల్లాలో కలెక్టరు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చుట్టూ సమస్యలన్నీ తిరుగుతున్నాయి.  

రెండోది : ప్రజలు నివసించేచోట బలమైన, సాధికారత గల స్థానిక ప్రభుత్వాలు లేకపోవడం పంచాయితీలను, మున్సిపాలిటీలను గత 20 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిల్చాయి. వాటికి అధికారాలు, నిధులు, సిబ్బందిని బదలాయించకుండా జీవచ్చవాలను చేశాయి. ప్రజలకు మంచినీరు, స్థానిక రోడ్లు, ఇళ్లు, మరుగుదొడ్లు, రేషన్‌కార్డులు, ఇతర సంక్షేమ పథకాల అమలు, పాఠశాల విద్య, ప్రాథమిక ఆరోగ్య సేవలు వంటి దైనందిన అవసరాలను అవి తీర్చగల స్థితిలో లేకుండా చేశారు. ప్రజల దరఖాస్తులలో అత్యధికం వీటికి సంబంధించినవే. స్థానికంగానే  నిర్ణయాధికారం వుంటే ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారాలు తక్షణం లభిస్తాయి.

ఇక చివరిదీ : ముఖ్యమైనదీ గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో యం.ఎల్‌.ఎ.ల రాజ్యం నడుస్తున్నది. ముఖ్యమంత్రులు వీరి గొంతెమ్మ కోర్కెలను తీర్చకుండా పాలించలేని అస్థిర పరిస్థితి వల్ల వారికి నియోజకవర్గాలను ధారాదత్తం చేస్తూ వచ్చారు. స్థానిక పోలీసు స్టేషన్‌ తహశీల్‌ కార్యాలయం, మండల పరిషత్‌ ఆఫీసుల యంత్రాంగం వివిధ పథకాలన్నింటినీ శాసనసభ్యుల గుప్పెట్లో పెట్టారు. వారి అనుమతి లేకుండా, మంజూరు లేకుండా ఏ చిన్న పనీ జరగని స్థితి నెలకొంది దీంతో పరిపాలన పూర్తిగా భ్రష్టుపట్టింది.

ఈ పరిస్థితిని చక్కదిద్దడమే తక్షణ కర్తవ్యం కావాలి. సుపరిపాలనా సూత్రాలను విస్మరిస్తే పరిస్థితిలో ఎలాంటి మార్పు వుండదు. అందుకే ఎందరు ముఖ్యమంత్రులు ఎన్ని బాటలు పట్టినా ప్రజలు వారిని ఇంటిదారి పట్టిస్తూనే వున్నారు.  
                                                                             ***

No comments: