లక్ష్య సాధనాలుగా నగదు బదిలీలు

              లక్ష్య సాధనాలుగా నగదు బదిలీలు  

                                                                                              - డి.వి.వి.యస్‌. వర్మ

2012 సెప్టెంబర్‌ 1 నుండి రాష్ట్రంలో కిరోసిన్‌కు నగదు బదిలీ పధకం ప్రయోగాత్మకంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్‌ జిల్లాలో 10, తూర్పుగోదావరి జిల్లాలో 35,  మొత్తం 45 రేషన్‌షాపులలో ఈ పధకం అమలుకు శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం పట్టణాలలో రేషన్‌కార్డుల మీద పేదలకు నెలకు నాలుగు లీటర్లు, ఇతర ప్రాంతాలలో రెండు లీటర్లు, దీపం పధకం కింద సిలిండర్‌ పొందిన వారికి 1 లీటరు చొప్పున రేషన్‌షాపుల ద్వారా  ఇస్తున్నారు. ప్రభుత్వం లీటరు కిరోసిన్‌కు  48 రూపాయలకు కొనుగోలు చేసి లబ్ధిదారులకు 15 రూపాయలకు అందిస్తున్నది. అంటే ప్రతి లీటరుకు ప్రభుత్వం 33 రూపాయలు సబ్సీడీని భరిస్తున్నది. ఈ నగదు బదిలీ అమలులోకి వచ్చేచోట ఎన్ని లీటర్లకు లబ్ధిదారులు అర్హులైతే అన్ని లీటర్లకు 33 రూపాయల వంతున వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. లబ్ధిదారులు మార్కెట్‌ ధరకు కిరోసిన్‌ను కొనుగోలు చేసుకోవాలి. ఒక నెలలో వారు కొనుగోలు  చేయకపోతే ఆ మొత్తం తిరిగి ప్రభుత్వానికి చేరుతుంది. లబ్ధిదారులకు విధిగా ఆధార్‌కార్డులు వుండేలా, బ్యాంకు ఖాతాలు వుండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా జరిగినప్పటికీ ప్రభుత్వం ఆశిస్తున్నట్లుగా కిరోసిన్‌ అవసరం లేని కొనుగోలుదారుల్ని, ఆ తర్వాత జరిగే బ్లాక్‌ మార్కెట్‌నూ ఇది నిరోధించేదిగా లేదు. గతంలో లాగే అవసరం లేనివారు లీటరుకు పదో, పదిహేనో డబ్బును డీలర్‌ నుండి పొంది సంతృప్తిపడే పరిస్థితే  కొనసాగుతుంది. పోతే నిజంగా అవసరం వున్న వారికి మార్కెట్‌లో కిరోసిన్‌ ధర పెరిగితే ఆ అదనపు మొత్తాన్ని తామే భరించుకోవలసి వస్తుందన్న ఆందోళన వుంది.  అందుచేత నగదు బదిలీ పధకాలను ప్రవేశపెట్టేముందు అనుకున్న లక్ష్యాలు సాధించే విధంగా వాటిని రూపొందించడం అవసరం.

 

2012-13 సంవత్సరానికి కేంద్రబడ్జెట్‌పై ఆర్ధికమంత్రి ప్రసంగంలో ఎరువులు, గ్యాస్‌సిలిండర్లు, కిరోసిన్‌లపై ఇస్తున్న పరోక్ష సబ్సీడీల స్థానంలో నేరుగా లబ్ధిదారుకు నగదు బదిలీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇది చిన్న విషయం కాదు. విధానపరంగా పెద్దమలుపు. దీనివెనుక చాలా కారణాలు వున్నట్టు కనిపిస్తున్నది. రాను రాను సబ్సీడీల భారం పెరుగుతూపోవడంతో బడ్జెట్లు దీనిని భరించలేని స్థితి ఏర్పడింది. 2001లో 7, 500 వేల కోట్లు వున్న కిరోసిన్‌ సబ్సీడీ 2011నాటికి 20 వేల 500 కోట్లకు పెరిగింది. అదేకాలంలో  గ్యాస్‌ సిలిండర్ల మీద సబ్సీడీ 6 వేల 700 కోట్లు నుండి  24,000 కోట్లు అయింది. డీజిల్‌ మీద సబ్సీడీ 7,500 కోట్లు నుండి 34,000 కోట్లు, ఎరువుల మీద వున్న14,000 కోట్లు వుంటే అది 55,000 కోట్లకీ, ఆహార వస్తువుల మీద 12,000 కోట్లు వుంటే సబ్సీడీ 2011 నాటికి 60,500 కోట్లు అయింది. ఇంతగా సబ్సీడీలు ఇస్తున్నా వ్యవసాయరంగంలో, పేదరికనిర్మూలనలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. పైగా ఈ సబ్సీడీలు దారిమళ్లడం, అవినీతికి ఆలవాలం కావడం సాగిపోతున్నది. సొమ్ముపోయే శనిపట్టినట్టు పరిస్థితి తయారైంది.

 

మరొకపక్క బోగస్‌కార్డుల ఏరివేతకు తగిన సాంకేతిక పరిజ్ఞానం రావడం, ఆధార్‌కార్డుల పంపిణీ పెద్దఎత్తున సాగించడం, బ్యాంకులు, పోస్టాఫీీసులు ఆర్ధిక లావాదేవీలను సమర్ధవంతంగా నిర్వహించగల స్థితిలో వుండడం, జాతీయ ఉపాధిపధకం అమలులో నేరుగా లబ్ధిదారులకు వేతనాల పంపిణీ వంటి అనుభవాలు గత సబ్సీడీపద్ధతి మార్చాలన్న ప్రయత్నాలకు సానుకూల అంశాలుగా భావించబడుతున్నాయి. ప్రపంచంలో పలుదేశాలలో పేదరికనిర్మూలనకు నిర్దేశిత లక్ష్యాల సాధనకు నగదు బదిలీ పధకాలు అమలు అవుతున్నాయి. షరతులతో కూడిన నగదు బదిలీపధకాలు లాటిన్‌ అమెరికా దేశాలలో మంచి ఫలితాలు సాధించడంతో అందరి దృష్టి వాటిమీద పడింది. 

 

బ్రెజిల్‌లో షరతులతో కూడిన నగదు బదిలీ పధకాలను 2003లో ఏకీకృతం చేసి బోల్సాఫెమిలియా పేరుతో నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రాధమిక విద్యకు కనీసగ్రాంటు, ఆహారభద్రతకు సంబంధించిన నగదు బదిలీ;  వంటగ్యాస్‌కు ఇచ్చే సబ్సీడీలను నగదు బదిలీ చేస్తున్నారు. కుటుంబంలోని  మహిళ యజమానురాలి పేరుమీద ''సిటిజన్‌ కార్డు'' పంపిణీ చేసి బ్యాంకుల ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు. దీని ఫలితంగా పోషకాహారలోపం గణనీయంగా తగ్గడం ,బడి బయట పిల్లలు లేకపోవడం, మధ్యంతరంగా  మానేసేవారి సంఖ్య బాగా తగ్గడం, పిల్లలకి వ్యాధినిరోధక టీకాలు పూర్తిస్థాయిలో జరగడం వంటి ఫలితాలు బాగా మెరుగైనట్లు అన్ని దేశాలు అంగీకరిస్తున్నాయి.

 

ఈ నగదు బదిలీ పధకం 1997లో మెక్సికోతో ప్రారంభించారు. ముందుగా  ప్రొగైసా పేరుతో ప్రారంభమై తర్వాత నగదు బదిలీపధకం ''ఆ పర్చు నిడాడెస్‌'' పేరుతో విస్తరించింది. అక్కడ కూడా ఫలితాలు ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించే విధంగా వచ్చాయి. అనేక దేశాలు నగదు బదిలీబాట పట్టాయి. కొలంబియా 2000 సంవత్సరంలో, ఎల్‌సాల్వెడార్‌లో 2005లో, నికరగ్వువాలో 2000లో,  పరాగ్వేలో 2005లో, దక్షిణాఫ్రికాలో 1998లో, ఇలా చాలా దేశాలకు నగదు బదిలీ పధకాలు విస్తరించి అమలులో వున్నాయి.   వివిధ దేశాలలో నగదు బదిలీ పధకాలు సారిస్తున్న ఫలితాల ప్రభావం కూడా నగదు బదిలీల మీద దృష్టిపడడానికి కారణంగా కనిపిస్తున్నది. 

 

నగదు బదిలీ అన్నపేరు వాడకపోయినా ప్రత్యక్షంగా లబ్ధిదారులకు నగదు చెల్లించే పద్ధతి మన దేశానికి, రాష్ట్రాలకి కొత్తకాదు. జీవనభద్రత కోసం సంక్షేమ పధకంగా ఇస్తున్న పెన్షన్‌లు మాతా శిశు సంరక్షణకు ప్రవేశపెట్టిన పలు పధకాలు నగదు బదిలీ పధకాలే. ఒకనాడు నిర్వహించిన ''పనికి ఆహారం'' పధకం  వస్తు బదిలీపధకం అయితే ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పధకం పేరుతో అతిపెద్ద నగదు బదిలీ పధకంగా వుంది. బడుగు బలహీనవర్గాల పిల్లల చదువులకు ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్లు నగదు బదిలీ పధకాలే.

అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రారంభించిన కిరోసిన్‌కు నగదు బదిలీ లేదా గ్యాస్‌ సిలిండర్లు, ఎరువుల సబ్సీడీలకు నగదు బదిలీ పధకాలు కొంత సంక్లిష్టమైనవి. ఈ పధకాలను తగిన జాగ్రత్తలతో రూపొందించకపోతే ఇటు ప్రభుత్వానికి, అటు లబ్ధిదారులకీ ప్రయోజనం కలగని స్థితి వస్తుంది. 

 

ఇప్పుడు కిరోసిన్‌ నగదు బదిలీ అంశాలను మరింత లోతుగా పరిశీలించాలి. పేదలు వంట చేసుకోడానికి, దీపాలు వెలిగించుకోడానికి వీలుగా సబ్సీడీపై కిరోసిన్‌ను ఇస్తున్నారు. కిరోసిన్‌ మీద ఎంతమంది వంట చేసుకుంటున్నారు. దీపాల కోసం ఎంతమందికి కిరోసిన్‌ అవసరం అన్న దానితో నిమిత్తం లేకుండా ప్రతి రేషన్‌కార్డుకీ ఒకే తీరున కిరోసిన్‌ పంపిణీతో ఈ సబ్సీడీ తలబరువైంది. అవసరం లేనివాళ్లు చౌకగా తిరిగి డీలర్‌కే అమ్మడం, పెద్దస్థాయిలో కిరోసిన్‌ బ్లాక్‌ మార్కెట్‌కీ, డీజిల్‌లో కల్తీకి కారణం అవుతున్నది. 

 

మనదేశంలో గ్రామీణప్రాంతంలో కిరోసిన్‌తో  వంట చేసుకునేవారు శాతం 2001లో 2 శాతం వుంటే అది 2008 నాటికి 0.6 శాతానికి పడిపోయింది. పట్టణాలలో అదే కాలంలో 15.3 శాతం నుండి 7.6 శాతానికి తగ్గింది. నిజానికి దేశంలో కిరోసిన్‌ను వంటకంటే దీపాలకే ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కిరోసిన్‌ దీపాలు వాడే వారి సంఖ్య 2002లో 47.2 శాతం  వుంటే, అది 2008కి 38.00 శాతానికి తగ్గింది. అదేకాలంలో పట్టణాలలో 7.8 శాతం నుండి 5 శాతానికి పడిపోయింది. ఆసియా దేశాలలో అతి ఎక్కువ సబ్సీడీతో అతి తక్కువ ధరకి అందిస్తున్న దేశంగా భారతదేశం వుంది. తగ్గుతున్న కిరోసిన్‌ వాడకాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కార్డుదారులందరికీ పంపిణీ చేయడంతో అది పెద్దస్థాయిలో బ్లాక్‌ మార్కెట్‌కి తరలిపోతున్నది. మహారాష్ట్రలో అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ కలెక్టరు యస్వంత్‌సోనావానే హత్య కిరోసిన్‌ మాఫియా చేసిందే. ఇలాంటి హత్యలు ఇప్పటికీ జరుగుతూనే వున్నాయి.  కిరోసిన్‌పై ఇస్తున్న 20,000 కోట్ల సబ్సీడీలో 8000 కోట్లు ఈ మాఫియాలపరం అవుతున్నది. దీనిని డీజిల్‌లో కల్తీ చెయ్యడంతో ఒక పక్క వాయుకాలుష్యం, మరోపక్క ట్రక్కులు, కార్లు రిపేర్ల పాలవుతున్నాయి. అందుచేత అవసరమైన వారికి మాత్రమే కిరోసిన్‌ అందే ఏర్పాటు వుండాలి తప్ప మూకుమ్మడిగా సబ్సీడీ కిరోసిన్‌ పంపిణీ చెయ్యడం మాఫియాలను పెంచిపోషించడం అవుతుంది. 

 

కాని ప్రస్తుతం సబ్సీడీ కిరోసిన్‌కు నగదు బదిలీ పధకాన్ని వర్తింపజేసినా అదనపు కిరోసిన్‌మాత్రం బ్లాక్‌ మార్కెట్‌కు రావడం ఆగిపోదు. అందుచేత నగదు బదిలీ పధకాలు ప్రభుత్వ వ్యయాన్ని దుబారాని తగ్గించేవిగా, లబ్ధిదారులకు నేరుగా సబ్సీడీని  అందించేవిగా వున్నప్పటికీ, అసలు పధకంలోనే లోపాలుంటే పరిస్థితి యధాతధంగానే వుంటుంది. లక్ష్యసాధనకు మార్గాలుగా షరతులతో కూడిన నగదు బదిలీలను అత్యంత లోపరహితంగా రూపొందించినప్పుడే ఇది సత్ఫలితాలను ఇస్తాయి. 


ఇందిరమ్మ బాట ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తుందా?

  ఇందిరమ్మబాట ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తుందా? 

                                                                                                       - డి.వి.వి.యస్‌. వర్మ

 

ఉప ఎన్నికలలో పరాజయం పాలైన తర్వాత నేరుగా జనంలోకి వెళ్లాలన్న తలంపుతో ఇందిరమ్మ బాటకు ముఖ్యమంత్రి రూపకల్పన చేశారు. తొలివిడతగా తూర్పు గోదావరి జిల్లాలో స్వయంగా  ముఖ్యమంత్రే ఈ కొత్తబాటకు శ్రీకారం  చుట్టారు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్లుగా ఇందిరమ్మ బాట ఫలితాలను విశ్లేషించుకోడానికి తూర్పుగోదావరి పర్యటన సరిపోతుంది. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించి మెరుగైన పాలన అందించేందుకే ఇందిరమ్మబాట ప్రారంభించినట్టు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడం ఈ బాట ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పధకాలను ప్రభుత్వ పధకాలుగా ప్రజలు భావించకపోవడం వల్లే వారి అభిమానాన్ని ఎన్నికల్లో చూరగొనలేకపోయామని అందుకోసమే ఈ పర్యటనగా ప్రకటించుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా ఏజన్సీలో ముసురుమిల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్ధులతో సంభాషణలు చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. రాత్రి అక్కడే బసచేశారు. నిజానికి ఆశ్రమ పాఠశాలల్లో వసతి గృహాల స్థితి అధ్వాన్నంగా వుంది. టాయిలెట్లు, స్నానాల గదుల స్థితి, నేలమీద పిల్లల పడకల స్థితి, అక్కడ పెట్టే భోజనం నాణ్యత ఎంత దారుణంగా వున్నాయో నిజంగా ముఖ్యమంత్రి తెలుసుకోవాలంటే  ఆయన కూడా అవే టాయిలెెట్లను, స్నానాల గదులను, నేలమీద పడకను స్వయంగా అనుభవించి వుంటే తమ పధకాలు ఎలా వున్నాయో అర్థం అయ్యేవి. అంతేకాని పిల్లలతో ముఖ్యమంత్రి భోజనానికి ప్రత్యేక విందు ఏర్పాట్లు, ఆయన నిద్రించటానికి ప్రత్యేక ఎ.సి. గది ఏర్పాటు చేయించుకుంటే క్షేత్రస్థాయి సమస్యలు ఎలా అనుభవంలోకి వస్తాయి? అలాగే ఉపాధి హామీ కూలీలతో సహపంక్తి భోజనం తంతు సాగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో మహిళా శాసనసభ్యులు వడ్డిస్తుండగా ముఖ్యమంత్రి విందు  ఆరగించారు. అందుకే ముఖ్యమంత్రులు, మంత్రులు ఎన్నిసార్లు పర్యటనలు చేస్తున్నా క్షేత్రస్థాయి వాస్తవాలు స్వానుభవంలోకి రాకుండా పోతున్నట్లు కనిపిస్తున్నది. 

 గతంలో యన్‌.టి.రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఇలాంటి పర్యటనలే చేశారు. ఆయన కోసం ప్రత్యేక వంటకాలు, ఒక ఎ.సి. కుటీరం వగైరాలతో సాగించారు. ఇలాంటి పర్యటనలు నేతల్ని ప్రజలతో మమేకం చెయ్యకపోగా ఇది ఒక ప్రచార తంతుగానే మిగిలిపోతున్నది.  

ఇక రెండోది  ఇందిరమ్మబాట తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోడానికి కాదని ప్రకటించుకున్నా జరిగిన తీరు ఆ ప్రకటనను అపహాస్యం చేసేదిగా సాగింది. ప్రభుత్వ పధకాలన్నీ వై.యస్‌. పేరుమీద సాగినందువల్ల నష్టం జరిగిందని భావించిన సర్కారు ఇప్పటి ప్రచారంలో మళ్లీ అదే బాట పట్టింది. ప్రభుత్వం ముద్రించిన ఇందిరమ్మబాట లోగోలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఫొటో పెట్టడం, 108 వాహనంపై రాజీవ్‌గాంధీ ఫొటోతోపాటు ముఖ్యమంత్రి ఫొటోను ముద్రించడం, రేషన్‌ షాపుల దగ్గర ఇలాంటి పోస్టర్లే దర్శనమిచ్చినట్లు వార్తలొచ్చాయి. ఇది రాజశేఖర రెడ్డి  నడిచినబాటే తప్ప ప్రభుత్వ పధకాలుగా ప్రచారం చేసే రూటు కాదని స్పష్టం అవుతున్నది.

ఇక ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం అంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసిన ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాటలో కొంత మాట మార్చారు. వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని, పని జరగకపోతే ఒక కార్డుముక్క రాసి పడెయ్యమని సూచించారు. కోనసీమ రైతుల సమస్యలపై ఇలాంటి అనునయం కూడా ప్రదర్శించకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ బాట పేరుతో ముఖ్యమంత్రి ప్రజల దగ్గరకు వెళ్ళారు. సమస్యలు విన్నారు. పరిష్కారాలను వాయిదా వేశారు. సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మిగిలాయి.

ప్రభుత్వ పధకాల అమలు తీరు, వివిధ స్థాయిలలో ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి, మంత్రులకు, శాసన సభ్యులకు తెలియని అంశాలు  కావు. ఎందుకంటే ఈ సమస్యలు హఠాత్తుగా ఈ రోజునే పుట్టుకొచ్చినవి అంతుచిక్కనివి కావు. ప్రభుత్వాలకి ముందుచూపు లేకపోవడం, పరిష్కారమార్గాలు తెలియకపోవడం అసలు సమస్యగా కనిపిస్తున్నది. ఉదాహరణకి ప్రతి సంవత్సరం జూన్‌ నెలలో పాఠశాలలు తెరుస్తారని అందరికీ తెలుసు. సుమారుగా ఎంతమంది పిల్లలున్నదీ తెలుసు అయినా పాఠశాలలు తెరిచేనాటికి పుస్తకాలు వుండవు, యూనిఫాంలు వుండవు. జూన్‌ నెలలో వర్షాలు పడతాయని అందరికీ  తెలుసు. రైతులకు అదే అదను అని తెలుసు. అయినా విత్తనాలు వుండవు. వున్నా అందవు. అందుచేత ఇంత నిర్దిష్టంగా తెలిసిన సమస్యలకే ప్రభుత్వాల దగ్గర పరిష్కారాలు వుండడం లేదంటే అది పాలనలోని అసమర్ధతకి అద్దం పడుతున్నది.

బాటలు ఎన్నికల్లో గట్టెక్కిస్తాయా?

 
రాష్ట్రంలో గత 15-16 సంవత్సరాలుగా అందరు ముఖ్యమంత్రులు తలోబాట చేపట్టిన వారే, యన్‌.టి.ఆర్‌. ముఖ్యమంత్రిగా ప్రజల వద్దకు పాలన పేరుతో తనదైన బాటను ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా జన్మభూమితో సహా పలు బాటలు ఎడతెరిపి లేకుండా నిర్వహించారు. రాజశేఖర్‌ రెడ్డి రచ్చబండలు, పల్లెబాటలు సాగించారు. ఇప్పుడు కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇందిరబాట పట్టారు. ఈ బాటలన్నీ ప్రజల కోసం చేపట్టినట్టు, ఎక్కడి సమస్యలకు అక్కడ పరిష్కారం కోసం ఉద్దేశించినట్లు ప్రకటించినవే. కాని ఈ బాటల వెనక వున్న లక్ష్యం వేరు. ప్రజల దృష్టిలో తామే సమస్యలు పరిష్కరించే హీరోలు కావాలని, అది తమ నాయకత్వాన్ని స్థిరపరుస్తుందని, తమ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తుందనీ వీరందరి విశ్వాసంగా కనిపిస్తుంది. అయితే ప్రజలకు కావాల్సింది బాటలు కాదు. వారికి చేతలు కావాలి. వారికి ఎక్కడి సమస్యలు అక్కడ తక్షణం పరిష్కారం కావడం ముఖ్యం. అందుకే ఏడాదికోసారి ప్రభుత్వాలు చేసే ఈ బాటల కోసం నిరీక్షించి వీరి రాకకోసం ఎదురుచూడరు. అయినా ఆశ చావక ఇలాంటి బాటలు వచ్చినప్పుడు ప్రజలు వినతి పత్రాలు ఇస్తూనే వుంటారు. వాగ్దానాలే తప్ప పరిష్కారాలు కావడం లేదని ప్రజలకు తెలుసు. 
 

సుపరిపాలనా సూత్రాలు :

 
 ఎందరు ముఖ్యమంత్రులు మారుతున్నా, ఎన్ని బాటలు నిర్వహిస్తున్నా, అందరూ సుపరిపాలనా సూత్రాలను విస్మరిస్తూ వచ్చారు. అందుకే సమస్యలు పేరుకుపోతున్నాయి. ప్రజలలో పాలనపట్ల తీవ్రమైన అసంతృప్తి పెచ్చరిల్లుతున్నది.

మొదటిది: ప్రతిబాటలోనూ ప్రజలు లక్షలాదిగా వినతి పత్రాలు సమర్పిస్తున్నారంటే ప్రభుత్వ పాలనాయంత్రాంగం పనిచేయడంలేదని అర్థం. దాని అసమర్థతకు, అవినీతికి ఇది దర్పణం.  పరిపాలనలో జవాబుదారీతనం పూర్తిగా లోపించినట్లు లెక్క. దీనికి కేవలం పాలనాయంత్రాంగాన్ని నిందించి ప్రయోజనం లేదు. ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోడానికి వీలుగా బాధ్యతల్ని, అధికారాలని నిర్దిష్టంగా వారికి దఖలు పర్చకపోవడం ప్రధాన కారణం. అందుకే సమస్యల్ని పైపైకి తోసెయ్యడం తప్ప ఎక్కడికక్కడ పరిష్కరించడం వారికి తప్పనిసరి బాధ్యత కావడం లేదు. అందుచేతనే జిల్లాలో కలెక్టరు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చుట్టూ సమస్యలన్నీ తిరుగుతున్నాయి.  

రెండోది : ప్రజలు నివసించేచోట బలమైన, సాధికారత గల స్థానిక ప్రభుత్వాలు లేకపోవడం పంచాయితీలను, మున్సిపాలిటీలను గత 20 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిల్చాయి. వాటికి అధికారాలు, నిధులు, సిబ్బందిని బదలాయించకుండా జీవచ్చవాలను చేశాయి. ప్రజలకు మంచినీరు, స్థానిక రోడ్లు, ఇళ్లు, మరుగుదొడ్లు, రేషన్‌కార్డులు, ఇతర సంక్షేమ పథకాల అమలు, పాఠశాల విద్య, ప్రాథమిక ఆరోగ్య సేవలు వంటి దైనందిన అవసరాలను అవి తీర్చగల స్థితిలో లేకుండా చేశారు. ప్రజల దరఖాస్తులలో అత్యధికం వీటికి సంబంధించినవే. స్థానికంగానే  నిర్ణయాధికారం వుంటే ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారాలు తక్షణం లభిస్తాయి.

ఇక చివరిదీ : ముఖ్యమైనదీ గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో యం.ఎల్‌.ఎ.ల రాజ్యం నడుస్తున్నది. ముఖ్యమంత్రులు వీరి గొంతెమ్మ కోర్కెలను తీర్చకుండా పాలించలేని అస్థిర పరిస్థితి వల్ల వారికి నియోజకవర్గాలను ధారాదత్తం చేస్తూ వచ్చారు. స్థానిక పోలీసు స్టేషన్‌ తహశీల్‌ కార్యాలయం, మండల పరిషత్‌ ఆఫీసుల యంత్రాంగం వివిధ పథకాలన్నింటినీ శాసనసభ్యుల గుప్పెట్లో పెట్టారు. వారి అనుమతి లేకుండా, మంజూరు లేకుండా ఏ చిన్న పనీ జరగని స్థితి నెలకొంది దీంతో పరిపాలన పూర్తిగా భ్రష్టుపట్టింది.

ఈ పరిస్థితిని చక్కదిద్దడమే తక్షణ కర్తవ్యం కావాలి. సుపరిపాలనా సూత్రాలను విస్మరిస్తే పరిస్థితిలో ఎలాంటి మార్పు వుండదు. అందుకే ఎందరు ముఖ్యమంత్రులు ఎన్ని బాటలు పట్టినా ప్రజలు వారిని ఇంటిదారి పట్టిస్తూనే వున్నారు.  
                                                                             ***

కొత్త చిట్కాల సృష్టి - కొర వడిన విధానాల దృష్టి

      కొత్త చిట్కాల సృష్టి - కొర వడిన విధానాల దృష్టి
                          రాష్ట్రంలో రాజకీయ  అంతర్మధనాలు
                                                                                                                        - డి.వి.వి.యస్‌. వర్మ


రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌పార్టీ, ప్రధాన ప్రతి పక్షంగావున్న తెలుగుదేశం పార్టీలు వరుస ఉపఎన్నికలలో పరాజయాలను, కొన్ని చోట్ల డిపాజిట్లు దక్కించుకోలేని పరాభవాలను పొందాయి. ఈ నేపథ్యంలో2014 ఎన్నికల్లో అధికారాన్ని అందిపుచ్చుకోడానికి అంతర్మధనాలు సాగిస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఓటమి తర్వాత ఢిల్లీ యాత్రలు సాగించారు. ఎవరి నివేదికలను వారే చంకన బెట్టుకుని అధిష్టానానికి  అందించారు. ఢిల్లీని మరింత అయోమయం పాలు చేశారు. ఇదే అదనుగా ముఖ్యమంత్రిని, పి.సి.సి అధ్యక్షుణ్ణి మార్చాలంటూ ప్రకటనలు గుప్పించారు. ఈ పదవులకు రకరకాల పేర్లను, ఊహాగానాలను ప్రచారంలో పెట్టారు. అధిష్టానం స్పందన భిన్నంగా వుండడంతో మేధోమధనాల మీద, కార్యకర్తల అసంతృప్తిమీద, కొత్త పథకాల వ్యూహరచన మీద చర్చను ప్రారంభించారు. ముఖ్యమంత్రి  తరపున మంత్రివర్గ ఉపసంఘం అంతర్మధనాన్ని సాగిస్తున్నది. వారు సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తూ 2014 ఎన్నికలలో గెలుపు చిట్కాలను రూపొందిస్తున్నారు. ప్రధాన ప్రతి పక్షంగావున్నా తెలుగు దేశం పార్టీలో అంతర్మధనం పూర్తి కావడానికి ముందు పార్టీలో యువనాయకత్వం చర్చను లేవనెత్తారు. ఇంతవరకు తెర వెనుక వున్న లోకేష్‌ను తెలుగు యువత నేతగా, వారసుడిగా తేవాలనే ప్రకటనలు చేయించారు. అయితే అది కుటుంబ కలహం కాకుండా చూడడానికి పక్కన పెట్టినట్టు కనిపిస్తున్నది. బి.సి. ఓట్లను ఏకమొత్తంగా రాబట్టుకోడానికి తెదేపా ''పెద్దపీట'' చిట్కాకు రూపకల్పన చేసింది. అలాగే రైతులకి, యువతకీ, మహిళాలకీ ''చిన్నపీట'' కసరత్తు జరుగుతున్నట్లు ప్రకటించారు.

ఇప్పటి వరకూ విశ్వసనీయత కోల్పోయిన పార్టీగా తెలుగు దేశం పేరు తెచ్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ దాని సరసన చేరింది. ఈ రెండు పార్టీలకీ ఇది సంక్షోభ కాలం. అయినా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి కొత్త విధానాల మీద, విభిన్నమైన పరిష్కారాలమీద దృష్టి పెట్టడానికి బదులు పాత మూసలో కొత్త చిట్కాల కోసం ప్రయత్నంగా కనిపిస్తున్నది. పాత మూస ఈ పార్టీలకు కొట్టిన పిండి. దానినే మరింత దంచుతున్నారు తప్ప మూస వెలుపల, బాక్స్‌ బయట కొత్త విధానాల కోసం దృష్టి సారించలేక పోతున్నారు.  

కాంగ్రెస్‌ పార్టీ : కాంగ్రెస్‌ మంత్రుల ఉపసంఘం తన చర్చల పరిధిని 5 అంశాలకు పరిమితం చేసినట్లు వార్తలొచ్చాయి. ఇందులో మొదటిది గ్రామపంచాయితీలకు ఎన్నికలు జరపడం. మున్సిపాలిటీలకు, జిల్లా పరిషత్‌లకు, మండలపరిషత్తులకు ఎన్నికలు జరపకుండా గ్రామ పంచాయితీలకే ఎన్నికలు జరపాలని సూచించడం కేవలం రాజకీయ లబ్ధికోసంమేనన్నది సుస్పష్టం. ఎందుకంటే గ్రామ పంచాయితీ ఎన్నికలలో పార్టీల గుర్తులు వుండవు. ఎవరు గెలిచినా గ్రామ అభివృద్ధి పనుల కోసం అధికార పార్టీ వైపు చూడడం సహజం. ఇలా గ్రామస్థాయిలో పట్టు సంపాదించే చిట్కాను మంత్రివర్గ  ఉపసంఘం వెలికి తీసింది. అయితే ఈ ఎన్నికలు అనుకున్నంత త్వరగా జరగే అవకాశం లేదు. రిజర్వేషన్ల సమస్య కోర్టు ముందున్నది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చొరవ తీసుకోలేని స్థితి. ఒకవేళ ఎన్నికలు జరిగినా అది సర్పంచులను ప్రభావితం చేస్తుందే తప్ప ప్రజల్ని ప్రభావితం చెయ్యాలంటే పంచాయితీలకు నిధులు, విధులు, సిబ్బందిని బదలాయింపులు జరగాలి. అలాంటి విధాన పరమైన దృష్టి ఉపసంఘం చర్చలలో మచ్చుకైనా లేదు.

ఇకరెండోది సంక్షేమ పథకాల అమలు వల్ల లబ్ధి ప్రభుత్వానికీ, కాంగ్రెస్‌ పార్టీకి దక్కే విధంగా క్షేత్రస్థాయి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నది. ఇది పార్టీ అనుయాయులకే పథకాల లబ్ధిని పరిమితం చేసి ఇతరులలో మరింత అసంతృప్తిని పెంచేది అవుతుంది. పైగా రాష్ట్రంలో పాలన స్తంభించిన స్థితిలో ఈ చిట్కా మరింత వికటిస్తుంది.

ఇక మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తున్న మిగిలిన మూడు అంశాలు అంటే నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, జిల్లా, పట్టణ, మండల స్థాయిలో పార్టీ కమిటీల ఏర్పాటు, పార్టీ శాసన సభ్యులు లేనిచోట్ల ఇంఛార్జీల నియామాకం వంటివి ఆ పార్టీలో కిందస్థాయి కార్యకర్తలను సంతృప్తి పరిచేవి మాత్రమే. ప్రజల్ని సంతృప్తి పరిచేవి మాత్రం కాదు.

అందుచేత కాంగ్రెస్‌పార్టీ సాగిస్తున్న అంతర్మధనంలో కొత్త విధానాల అన్వేషణగాని, కొత్త పథకాల రూపకల్పనగాని లేవు. రాష్ట్రంలో అవినీతి రహితంగా ప్రజలకు సేవలందించే సమర్ధ పాలనకు మార్గాలు లేవు. కేవలం కార్యకర్తలను సంతృప్తి పరిచే చిట్కాలతో ఇదే తరహా పాలన తంతు సాగిస్తే 2014లో ఫలితాలు ఇంతకంటే దారుణంగా వున్నా ఆశ్చర్యపోనక్కర లేదు.

తెదేపా : తెలుగు దేశం పార్టీ తాను పరిపాలించిన కాలాన్ని ఇప్పటికీ స్వర్ణయుగంగానే భ్రమిస్తున్నది. అదే నిజమైతే 2004లో అది ఓటమి పాలు కాకూడదు. ఒకవేళ ప్రజలు మార్పు కోరారని సరిపెట్టుకున్నా 2009లో నైనా గెలుపు సాధించి వుండాలి. ఇప్పటికీ తెదేపా అదే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ తన ఓటమి కారణాలను లోతుగా పరిశీలించుకోలేక పోతున్నది.  ఆ పార్టీ అంతర్మధనం కూడా పాతమూసలో, చిట్కాల వేటగా సాగింది. 2009లో నిరుపేద కుటుంబాలకు నెలకు 2000 రూపాయలు, ఇతర పేదలకు 1500, 1000 రూపాయలు ఇచ్చే ''నగదు బదిలీ'' పథకం ఎన్నికల్లో గెలుపు కోసం వేసిన చిట్కా. ఇది జరిగే పని కాదులెమ్మని ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుత వాగ్దానాల చిట్టాలలో నగదు బదిలీ, కలర్‌ టీవీలు లేవు. అందుకే తెదేపా నినాదాలకు విశ్వసనీయత లేకుండా పోతున్నది.

ఇప్పుడు ఆ పార్టీ కొత్త పథకాల రచనకు బదులు ప్రభుత్వ పథకాలకు అదనంగా ''కొసరు'' పథకాలు ప్రకటిస్తున్నారు. పెన్షన్‌ సొమ్ములు పెంచడం, 6గంటల విద్యుత్‌ను 9గంటలకు పొడిగించడం, ఉన్నత విద్యలో ఫీజు రీ యింబర్స్‌ మెంటును విస్తృత పర్చడం, రూపాయి బియ్యాన్ని ఉచితం చెయ్యడం వగైరాలన్నీ ఈ ''కొసరు'' పథకాలే. ఇప్పుడు ఆడ పిల్లలకు 25,000 రూపాయల ''పెళ్లికానుక'' పథకం కొత్తదే అయినా రెండేళ్లపాటు ఎంతమంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటారో వేచిచూడాల్సిందే.

ఇక గణనీయమైన సంఖ్యలో వున్న బి.సి. ఓటర్లను ఆ కట్టుకోడానికి ప్రకటించిన ''పెద్దపీట''లో తెలుగుదేశం పార్టీ తనకుతానుగా చెయ్యగలిగింది అసెంబ్లీ ఎన్నికలలో 100 సీట్లు వారికి కేటాయించడం. ఇలా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి  చట్టంతో నిమిత్తం లేకుండా ఆ పార్టీ ముందుకు రావడం మంచి పరిణామం.

ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చెయ్యగలిగినవి బి.సి.లలో వివిధ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు, నామినేటెడ్‌ పోస్టులలో రిజర్వేషన్లు, బడ్జెట్‌లో 10 వేల కోట్లతో ఉపప్రణాళిక తీసుకురావడం. ఉపప్రణాళిక అన్న కొత్త పేరు తప్పిస్తే ఇప్పటికే వివిధ రూపాలలో బి.సి.సంక్షేమానికి దాదాపుగా ఈ మొత్తం ఖర్చు అవుతున్నది. ఇది తప్ప మిగిలినవన్నీ పదవుల చుట్టూ ఉన్న రాజకీయం తప్ప బి.సి. ఓటర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం కల్పించే అంశాలు కొరవడ్డాయి. ఇది శాసనసభలో ప్రవేశించాలనుకునే వారి రాజకీయ ఆకాంక్షను తీరుస్తుందే తప్ప సాధారణ ఓటర్ల జీవితాలను ప్రభావితం చేసేది అవుతుందా? అన్నది ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.

అలాగే తాము చట్టసభలలో బి.సి.లకు 33శాతం రిజర్వేషన్ల కోసం పోరాడతామని ప్రకటించడం ఆ పార్టీ చేయగలిగిందే. కాని తాము అధికారంలోకి వస్తే స్థానిక ప్రభుత్వాలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, విద్య ఉద్యోగాలలో 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం బి.సి.లను ప్రలోభపెట్టే నినాదం తప్ప ఆ పార్టీ తనంతట తానుగా నెరవేర్చగలిగేది కాదు. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ రెండు అంశాలపైనా 50శాతం రిజర్వేషన్లు దాట కూడదన్న లక్ష్మణ రేఖ గీసింది. ఇక పోతే రాజ్యాంగ సవరణకు పోరాటం చెయ్యడం తప్ప వారికి మరో మార్గం లేదు. ఇలాంటి వాగ్దానాల వల్ల ఆ పార్టీ విశ్వసనీయత పెరగకపోగా తరిగే ప్రమాదం వుంది. మొత్తం మీద తెదేపా బి.సి.లకు చేేస్తున్న వాగ్దానాలు వారిలో రాజకీయంగా ఎదగాలన్న ఆకాంక్షను తృప్తి పరిచేదే తప్ప బి.సి.లలో పేదరికాన్ని తొలగించేవి, మంచి ప్రమాణాల విద్యనీ, వైద్యసేవల్ని, ఉపాధి అవకాశాల్ని ప్రత్యక్షంగా ఆ తరగతులకు అందించే అంశాలు అందులో లేవు. అందుచేత ''కొసరు'' పథకాలతో, నేతలకు పదవీ పందేరాల చుట్టూ రూపొందిన నినాదాలు ఆ పార్టీకి విశ్వసనీయతని, 2014నూ ఓట్ల వర్షాన్ని కురిపిస్తాయా అన్నది ప్రశ్నే.

వై.కా.పా : రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 6న వై.కా.పా విస్తృత సమావేశం జరుపుకున్నారు. తమది ప్రజలపక్షంగా ప్రకటించుకుని, నిరంతరం ప్రజలలోవుంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలను నెమరువెయ్యడం, జగన్‌ జైలు నుండి త్వరలోనే వస్తారన్న భరోసా ఇవ్వడం మీదే విజయమ్మ ప్రసంగం నడిచింది. ఎందుకంటే ఈ రెండింటి మీదే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి వుంది.

ఇటీవల ఉప ఎన్నికలలో వై.కా.పా మంచి విజయాలను సాధించింది. ప్రజల సానుభూతిని, విశ్వాసాన్ని పొందగలిగింది. జగన్‌ జైలు పాలుకావడం, అవినీతి కుంభకోణాలు వెలుగు చూడడం ఆ పార్టీ దిగువ నాయకత్వాన్ని అయోమయంలో పడేశాయి. ఇంతటి విజయాల తర్వాత ఆ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతాయని చేసిన ఊహలు నిజం కాలేదు. ఈ పార్టీని అభిమానించే ఓటర్లు వున్నా నిలబెట్టుకోగల నాయకత్వమే లోటు. ఉన్నవాళ్లు రాజశేఖర రెడ్డి పథకాలు వల్లి వేయడం తప్ప జనం తలరాతలు మార్చే ప్రత్యేక విధానాలు వారికి లేవు.
మొత్తం మీద ప్రధాన సంప్రదాయ పార్టీలన్నీ 2014 ఎన్నికలకు సంసిద్ధమౌతున్నాయి. కొత్త విధానాలతో ప్రజల విశ్వాసాన్ని పొందాలన్న ప్రయత్నం చెయ్యకుండా పాత మూసలో కొత్త చిట్కాల సృష్టితో గట్టెక్కే కసరత్తుగానే రాజకీయ అంతర్మధనాలు సాగిస్తున్నాయి.






 

 స్థాయీ సంఘాలతో  చట్టసభలకు కొత్త సామర్ధ్యం

                                                                                                                             - డి.వి.వి.యస్‌. వర్మ



ఆంధ్రప్రదేశ్‌లో చట్టసభలకు స్థాయీసంఘాలు రాబోతున్నాయి. శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ , శాసనమండలి ఛైర్మన్‌ డా|| చక్రపాణిల అధ్యక్షతన జరిగిన ఉభయసభల రూల్స్‌ కమిటీల సంయుక్త సమావేశం ఆ మేరకు నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. ఒకపక్క ప్రభుత్వం, మరోపక్క ప్రతిపక్ష పార్టీలు స్థాయీసంఘాల ఏర్పాటుకు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభ స్పీకర్‌ ప్రకటించారు.

పార్లమెంటులో స్థాయీ సంఘాల తరహాలో ఇవి వుంటాయని, కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే అమలులో వున్న ఇలాంటి కమిటీల వ్యవస్థను అధ్యయనం చేసి మెరుగైన విధి విధానాలతో రాష్ట్రంలో ఈ స్థాయీ సంఘాలను ఏర్పాటు చేస్తామని స్పీకర్‌ ప్రకటించారు.

గత రెండు దశాబ్దాలుగా నానాటికి తీసికట్టు అన్నట్టుగా శాసనసభ సమావేశాల రోజులు క్రమేణా తగ్గిపోతూ వచ్చాయి. లోతైన చర్చలు మృగ్యం అయ్యాయి. సభా కార్యకలాపాలను స్తంభించడం మీదే ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతుంటే ప్రభుత్వం  పక్షం దానికి దోహదం చేసే రీతిలో ప్రతిస్పందిస్తున్నది. ఎవరు అధికారంలో వున్నా సభ జరుగుతున్న తీరు మాత్రం మారడం లేదు. రోజుకో గందరగోళం, పతాక శీర్షికల కోసం రగడలు, రచ్చలు, టెలివిజన్‌ ప్రసారాలలో హీరోలను తలపించేలా కనిపించాలనే తాపత్రయంతో సభ జరగకపోగా ప్రజాధనం దుర్వినియోగం కావడం నిత్యకృత్యం అయింది. చివరికి బడ్జెట్‌ సమావేశాలలో కూడా అత్యధిక పద్దులపై చర్చలు లేకుండానే పలుశాఖల డిమాండ్ల ఉరికొయ్యలకెక్కుతున్నాయి. ఇక  బిల్లుల పైనా, విధానపరమైన అంశాలపైనా చర్చలు లేకుండా ''మమ'' అనిపిస్తున్నారు. అందువల్లనే చట్టసభల మీద ప్రజల విశ్వాసం నానాటికీ సన్నగిల్లుతున్నది.  ప్రజల అధికార పీఠం ప్రజా సమస్యలపై చర్చించే వేదిక కాకపోగా వాకౌట్లకు, వాగ్యుద్ధాలకు వేదిక కావడం చూపరులకు జుగుప్స కలిగిస్తున్నది.

శాసనసభ పనితీరు పై స్పీకర్‌ పలు సందర్భాలలో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఆయన అంతటితో సరిపెట్టుకోకుండా శాసనసభ్యుల భాగస్వామ్యాన్ని పెంచడానికి దోహదం చేసే స్థాయీ సంఘాల ఏర్పాటుకు చొరవతీసుకున్నారు. అటు ప్రభుత్వాన్ని, ఇటు రాజకీయ పార్టీలను ఒప్పించడంలో కృతకృత్యులయారు. వచ్చే శీతాకాల సమావేశాల నాటికి ఈ స్థాయీ సంఘాల ఏర్పాటుకు రంగాన్ని  సిద్ధం చేశారు. ఈ స్థాయీ సంఘాల ఏర్పాటు కాగానే శాసనసభ పనితీరు, సభ్యుల ప్రవర్తన రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యాలు తొలగిపోతాయని  ఎవరైనా భావించడం అత్యాశే అవుతుంది.  ఎందుకంటే వీరంతా దానికే అలవాటు పడ్డారు. ఆ  మూసలో నుండి బైటపడడం అంత తేలిక కాదు. కాని స్థాయీ సంఘాలు అలాంటి మార్పుకు దోహదం చేస్తాయనడంలో  ఆ దిశగా అడుగులు పడేలా చేస్తాయనడంలో ఎలాంటి సందేహానికీ తావులేదు. ఎందుకంటే ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రాలలో ఇలాంటి స్థాయీసంఘాలు విస్తరించడం, అవి సత్ఫలితాలను ఇస్తుండడం స్పష్టంగా కనిపిస్తున్నది.

రాష్ట్ర శాసన సభ చరిత్రలో స్థాయీ సంఘాల ఏర్పాటు ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అయినా మన ప్రింటు ఎలక్ట్రానిక్‌ మీడియాలు ఇంతటి ప్రాధాన్యత గల అంశాన్ని కేవలం  ఒక వార్తగా  ప్రకటించి ఊరుకున్నాయి. అనునిత్యం శాసనసభ  సమావేశాలకి ముందు సంఘర్షణ వాతావరణాన్ని సృష్టించే రాతలు రాయడం, అలాంటి చర్చలను  ప్రసారాలు చెయ్యడం, సభ సజావుగా సాగితే చప్పగా సాగినట్టు వ్యాఖ్యానించడం, సమావేశాల అనంతరం ఎంతకాలం వృధా అయిందీ ఎన్ని కోట్లు ఖర్చు దుబారా అయిందీ వివరించే కధనాలతో ముగింపులు, ముక్తాయింపులతో కాలం గడిపే మీడియా  ఈ సానుకూల పరిణామాన్ని పూర్తిగా విస్మరించడం వాటి స్థితికి అద్దం పడుతుంది.

పార్లమెంటు తరహాలో : చట్టసభలకు స్థాయీ సంఘాలు మన రాష్ట్రానికి కొత్తగాని మన పార్లమెంటుకి, కొన్ని రాష్ట్రాల సభలకి కొత్త కాదు. పార్లమెంటు కార్యకలాపాల నిర్వహణకీ, శాసన సభల నిర్వహణకీ సంబంధించిన వివిధ కమిటీలు చాలా కాలం నుండీ వున్నాయి. పోతే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్థాయీ సంఘాలను ఏర్పాటు పార్లమెంటు స్థాయిలో 1993లో జరిగింది.  అంటే ఇలాంటి స్థాయీసంఘాలకు దేశంలో దాదాపు రెండు దశాబ్దాల చరిత్ర వుంది. ప్రస్తుతం పార్లమెంటుకు ఈ తరహాస్థాయి సంఘాలు 17 వున్నాయి. వీటిలో ఉభయసభలకీ చెందిన వారు సభ్యులుగా వుంటారు. ఇందులో 6 స్థాయీసంఘాల కార్యకలాపాలకు రాజ్యసభ సెక్రటేరియట్‌, 11 స్థాయిసంఘాల కార్యకలాపాలకు లోక్‌సభ సెక్రటేరియట్‌లు తోడ్పాటునందిస్తాయి. ఉభయసభలకు చెందిన ప్రతి సభ్యుడు ఏదో ఒక స్థాయీ సంఘంలో వుంటారు. అయితే మంత్రులకు మాత్రం ఈ కమిటీలో వుండే వీలు లేదు. ఈ స్థాయీ సంఘాల పదవీకాలం ఒక సంవత్సరం వుంటుంది. అంటే 5 ఏళ్లలో ప్రతి సభ్యుడు 5 స్థాయీసంఘాలలో పనిచెయ్యడానికి అనుభవం గడించడానికి వీలు కలుగుతుంది. ఈ సంఘాలలో గరిష్టంగా 45 మంది సభ్యులుంటారు. ఇందులో 30 మందిని లోక్‌సభస్పీకర్‌, 15 మందిని రాజ్యసభ చైర్మన్‌ నామినేట్‌ చేస్తారు.

ఈ స్థాయీ సంఘాలు తమ పరిధిలోని వివిధ ప్రభుత్వశాఖల బడ్జెట్‌ డిమాండ్లను, ఆ శాఖల వార్షిక నివేదికలను దీర్ఘకాలిక విధాన పత్రాలను అధ్యయనం చేసి తగు సూచనలు సిఫారసులను అందజేస్తాయి. ఈ శాఖలకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లులను పరిశీలిస్తాయి.  అయితే వారీ పాలనా వ్యవహారాలలో తలదూర్చవు. మొత్తం మీద ఈ స్థాయీసంఘాలు వివిధ ప్రభుత్వశాఖల ప్రణాళికలు, విధానాలు, పద్దులు, చట్టాల మీద అధ్యయనానికి, నిఘాకి వేదికలుగా వుంటాయి.

రాష్ట్రాలలో....

 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్థాయిసంఘాలు కేరళ, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, తదితర రాష్ట్రాలలో ఏర్పాటై పని చేస్తున్నాయి. ఉదాహరణకి కేరళలోని స్థాయీసంఘాలను తీసుకుంటే వీటికి సభ్యుల్ని స్పీకర్‌ నియమిస్తారు. ఆ సభ్యులలో ఒకరు ఛైైర్మన్‌గా వ్యవహరిస్తారు. పార్లమెంటరీ కమిటీలకు భిన్నంగా ఇక్కడ ఆ శాఖమంత్రి ఈ కమిటీలో ఎక్స్‌అఫీషియా సభ్యులుగా వుంటారు. (ఛైైర్మన్‌గా కాదు) సంబంధిత శాఖ మంత్రి ఇలాంటి కమిటీలకు ఛైర్మన్‌గా వుండకూడదన్నదానిని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. పోతే సభ్యులుగా వుండాలా? వద్దా? అన్న దానిమీద కొంత చర్చ నడుస్తున్నది. రాజ్యసభ ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ దీనిపై చేసిన వ్యాఖ్యను అందరూ పరిగణనలోకి తీసుకోవాలి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయా శాఖల మంత్రులు కీలకపాత్ర పోషిస్తారు. గనుక ఈ స్థాయీసంఘాలలో ఆయా మంత్రులు సభ్యులుగా వుండడం మంచిదని దానివల్ల వివిధ పక్షాలు చేసే సూచనలు, నిపుణులు ఇచ్చే అభిప్రాయాలు, ఈ నిర్ణయాల వల్ల ప్రభావితులయ్యే ప్రజాసమూహాల అభిప్రాయాలు నేరుగా ఆ శాఖమంత్రి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అందువల్ల ఆ మంత్రిత్వ శాఖ మెరుగైన విధానాలు చేపట్టడానికి వీలు కలుగుతుందని హమీద్‌ అభిప్రాయపడుతున్నారు.

పోతే కేరళలో ఈ స్థాయీ సంఘాలకు ఆయా శాఖల డిమాండ్స్‌, బిల్లుల పరిశీలనతోపాటు, ఆ శాఖకు సంబంధించిన ప్రత్యేక అంశాల మీద అధ్యయనానికి, ప్రభుత్వానికి విధానపరమైన అంశాలమీద సూచనలు, రాష్ట్ర ప్రణాళిక మీద, దాని అమలు మీద సిఫారుసులకు వీలు కల్పించారు.

మొత్తం మీద వివిధ శాఖలకు సంబంధించిన ఈ స్థాయీ సంఘాలు ఇటు పరిపాలనలో జవాబుదారీతనానికి, అటు వివిధ పార్టీల శాసనసభ్యుల భాగస్వామ్యానికి, ఏకాభిప్రాయ సాధనకు దోహదం చేస్తున్నందున దేశవిదేశాలలో ఇలాంటి కమిటీల ఏర్పాటు నానాటికీ పెరుగుతున్నది. వాటి విధివిధానాల పరిధి విస్తరిస్తున్నది. పార్లమెంటు, శాసనసభలలో సభ్యుల సంఖ్య పెద్దది కావడంతో సూక్ష్మఅంశాల చర్చకు చాలా సందర్భాలలో అవకాశం లేకుండా పోతున్నది. పైగా అసలు సమస్య కంటే సభ్యులు తమ పార్టీల విధానాలపరంగానే వాదనలు సాగించడం ప్రధాన లక్ష్యం కావడంతో అర్ధవంతమైన చర్చ, ఏకాభిప్రాయ సాధన మృగ్యం అవుతున్నది.

ఈ సభల కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారాల జరగడం వల్ల సభ్యులు ప్రజల దృష్టిని ఆకర్షించడానికే ప్రాధాన్యత ఇవ్వడం సహజం.

మంత్రులకున్నట్టుగా శాసనసభ్యులకు తగిన సమాచారం అందుబాటులో లేకపోవడం, నిపుణులతో సంప్రదింపులకు, పాలనాయంత్రం ముఖ్యులతో చర్చలకు అవకాశాలు తక్కువ కావడంతో సభ్యుల పరిజ్ఞానం, నాయకత్వ పాత్ర పెరగడం లేదు. పైగా పార్టీల మధ్య ఘర్షణే తప్ప సామరస్యపూర్వక చర్చలకు వీలు కలగడంలేదు.

వీటన్నింటికీ స్థాయీసంఘాలు పరిష్కారంగా కనిపిస్తున్నాయి. వివిధ శాఖల మీద, పద్దులు మీద, బిల్లుల మీద మరింత లోతైన చర్చలకు నిపుణుల సలహాలు పొందడానికి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్య ప్రాధాన్యతరీత్య పరిష్కారాలను కనుగొనడానికి ఇవి దోహదం చేస్తాయి. అందువల్ల స్థాయీసంఘాల ఏర్పాటు నిస్సందేహంగా ఒక ఆహ్వానించదగ్గ పరిణామం.